
సరైన నష్టపరిహారం అందించండి
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
కంది(సంగారెడ్డి): భెల్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జాతీయ రహదారి –165 విస్తరణలో భాగంగా భూములు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. మండల కేంద్రమైన కందిలో జాతీయ రహదారి విస్తరణలో భూములు స్థలాలు కోల్పోతున్న బాధితులు, అధికారులతో శుక్రవారం జగ్గారెడ్డి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులు నష్టపోకుండా సర్వేచేసి కలెక్టర్‌కు నివేదిక పరిహారం అందేలా చూడాలన్నారు. స్థలాలు కోల్పోతున్న వారు మాట్లాడుతూ..రోడ్డు విస్తరణ అధికంగా చేయడం వల్ల తమ ఇళ్లను కోల్పోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జగ్గారెడ్డి స్పందిస్తూ...ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నష్టపరిహారం విషయంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో నేషనల్ హైవే డీఈ రామకృష్ణ, తహసీల్దార్ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి చేర్యాల ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మోతిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.