
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
పటాన్‌చెరు టౌన్: తండ్రి మందలించడంతో కూతురు అదృశ్యమైంది. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో ఉండే లక్ష్మి కూతురు ప్రియ (19) ఇస్నాపూర్‌లో ఓ బట్టల షాపులో పనిచేస్తుంది. ఈ క్రమంలో ఈనెల 8న ఉదయం ప్రియ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో ఎవరికి చెప్పకుండా అదే రోజు రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు.
కాశీంపూర్‌లో యువకుడు
జహీరాబాద్: మండలంలోని కాశీంపూర్ గ్రామానికి చెందిన సుభాష్ (28) అదృశ్యమయ్యాడు. చిరాగ్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం... ఈ నెల 4న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తండ్రి నర్సింహులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
చెరువులో మృతదేహం లభ్యం
సంగారెడ్డి క్రైమ్: చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... పట్టణంలోని స్థానిక మహబూబ్‌సాగర్ చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని శనివారం ఉదయ స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందిచారు. వెంటనే ఘటన స్థలానికి చెరుకొని మృతదేహన్ని బయటకు తీశారు. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి మృతి చెందాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆభరణాలు అపహరించిన
నిందితుడి అరెస్టు
పుల్‌కల్(అందోల్)/జోగిపేట: మహిళకు బైక్‌పై లిఫ్టు ఇచ్చి ఆభరణాలు అపహరించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జోగిపేట సీఐ అనిల్‌కుమార్ కేసు వివరాలు వె ల్లడించారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన మంగళి సత్యమ్మ(58)శుక్రవారం సదాశివపేటలోని తనసోదరి వద్దకు బయలు దేరింది. మార్గమధ్యలో చిలిప్‌చెడ్ మండలం బంజారనగర్‌కు చెందిన రమావత్ బన్సీలాల్ (బన్సీ) ఎదురై సత్యమ్మతో మాటలు కలిపి, మీ చెల్లి ఇంటి వద్ద దింపుతానని నమ్మించాడు. పల్సర్ బైక్‌పై ఆమెను ఎక్కించుకుని పుల్‌కల్ మండలం గొంగులూరు శివారుకు వచ్చాడు. అక్కడ మైసమ్మ గుడివద్దకు రాగానే బైక్ ఆపి మహిళపై దాడిచేసి బంగారు కమ్మలు, వెండి కాళ్ల కడియాలు లాక్కున్నాడు. ఆమె అరవడంతో దూరంగా ఉన్న వ్యక్తి పరిగెత్తుకు రావడంతో పరారయ్యాడు. పుల్‌కల్ ఎస్‌ఐ విశ్వజన్ నేతృత్వంలో ఆభరణాలను రికవరీ చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
పేకాట స్థావరంపై దాడి
కల్హేర్(నారాయణఖేడ్): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. సిర్గాపూర్ ఎస్‌ఐ మహేశ్ వివరాల ప్రకారం...
సిర్గాపూర్ మండలం అంతర్‌గాం తండాలో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న కొంతమందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 3,250, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
దొంగ అరెస్టు
సిద్దిపేటకమాన్: దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... జనగామ జిల్లా నర్మెటకు చెందిన శివరాత్రి ఈశ్వర్ పట్టణంలోని మిలాన్ గార్డెన్ సమీపంలో నూతనంగా నిర్మించిన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడ్డాడు. స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం