
సర్కారు బడుల్లో అల్పాహారం
సంఖ్య
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
● చర్యలు చేపట్టిన ప్రభుత్వం ● జిల్లాలో 1,08,293మందివిద్యార్థులకు ప్రయోజనం ● ఇప్పటికే కొనసాగుతున్నరాగిజావ పంపిణీ
నారాయణఖేడ్: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు వారికి ఉదయం పూట అల్పాహారం అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రానున్న విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి పాఠశాలల విద్యార్థులందరికీ అల్పాహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ పథకం జిల్లాలోని నియోజకవర్గానికి రెండు పాఠశాలల చొప్పున అక్కడక్కడా ప్రారంభించాక శాసనసభ ఎన్నికలు రావడం, అనంతరం ప్రభుత్వం మారడంతో అల్పాహారం కొనసాగలేదు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు అల్పాహారం అందించాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో చైన్నెలో ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లిన సీఎం తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోనూ అమలు చేయాలని గతంలోనే వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడంతో రానున్న విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం అమలైతే జిల్లాలో 1,08,293మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
పథకం అమలుపై కసరత్తు
పథకాన్ని ఎలా అమలు చేయాలి? అల్పాహారంగా ఏమేమి అందించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట కార్మికుల ద్వారా వీటిని వండించి అందించాలని ఆలోచిస్తున్నారు. అల్పాహారంగా విద్యార్థులకు రైస్‌కు సంబంధించిన వంటకాలు పొంగలి, కిచిడీ, పులిహోరా, వెజ్ బిర్యానీ తరహాగా, మరో రెండు రోజులు ఉప్మా, ఇంకో రెండు రోజులు ఇడ్లీ/ బోండా లాంటివి అందించాలన్న ఆలోచన చేస్తున్నారు. మూడు రోజులపాటు రైస్‌తో కూడుకున్న అల్పాహారం, మరో రెండు రోజులు ఇతర అల్పాహారం అందించాలని యోచిస్తున్నారు. విద్యార్థుల అల్పాహారంకు అయ్యే వ్యయంలో కొంత శాతం కేంద్రం పీఎంశ్రీ పథకం ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్రం తన వాటా నిధులు చెల్లించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో భరించి అల్పాహారం అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సగటున రూ.10 నుంచి రూ.15 వరకు
ప్రస్తుతం అల్పాహారంకు ఒక్కో విద్యార్థికి 1 నుంచి 5వ తరగతివరకు రూ.8, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.12 చొప్పున ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సగటున ఒక్కో విద్యార్థికి రూ.10 నుంచి రూ.15వరకు ఖర్చు చేసి పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికులద్వారానే అల్పాహారం వండించాలని, ఇందుకుగాను వారికి నెలకు రూ.500 చొప్పున పారితోషికం అదనంగా చెల్లించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. పాఠశాలలకు వంటగ్యాస్ సిలిండర్ల కనెక్షన్లు సమకూర్చాలని కూడా విద్యాశాఖ ప్రతిపాదించింది. ఒక్కో కనెక్షన్‌కు రూ.రెండు వేలపైగా డిపాజిట్ చేయాల్సి ఉండగా ఈ మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలని నివేదించింది. గ్యాస్ కొనుగోలు ధరను మాత్రం వంటగ్యాస్ ఏజెన్సీలు భరించాల్సి ఉంటుంది. ఇప్ప టికే ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారంగా రాగి జావను అందిస్తోంది.
పాఠశాలలు సంఖ్య విద్యార్థుల
ప్రాథమిక పాఠశాలలు 863 55,577
ప్రాథమికోన్నత
పాఠశాలలు 191 38,821
ఉన్నత పాఠశాలలు 211 13,895