
నూనెగింజల సాగుపై దృష్టి సారించాలి
● జిల్లా వ్యవసాయాధికారి కె.శివప్రసాద్ ● ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషియోజన ఆవిష్కరణ వీడియో ప్రదర్శన
జహీరాబాద్: రైతులు పప్పు దినుసులు, నూనెగింజల పంటలను సాగుచేస్తూ వాటి దిగుబడులను పెంచుకునే విధానంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.శివప్రసాద్ సూచించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన కార్యక్రమాన్ని శనివారం మండలంలోని దిడిగి గ్రామ శివారులోని డీడీఎస్–కేవీకేలో ధన్ ధాన్య కృషి యోజన ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. ప్రధాని మోదీ ప్రసంగం ముగిశాక కేవీకే శాస్త్రవేత్త వరప్రసాద్ తెలుగు అనువాదాన్ని రైతులకు వినిపించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ...ఇటీవల గ్లోబల్ పరిస్థితుల కారణంగా పప్పులు, నూనెగింజల దిగుమతుల్లో అంతరాయం ఏర్పడిందన్నారు. స్వదేశీ ఉత్పత్తుల ద్వారానే ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందని చెప్పారు. అందుకే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపుకు పెద్ద పీట వేస్తోందన్నారు. ఈ సందర్భంగా కుసుమ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ భిక్షపతి, మండల వ్యవసాయాధికారులు లావణ్య, వెంకటేశ్వర్లు, నవీన్, అస్సరుద్దీన్, వినోద్‌కుమార్, శాస్త్రవేత్తలు వరప్రసాద్, సాయి ప్రియాంక, అగ్రామనిస్ట్ రమేష్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీలో..
జహీరాబాద్ పట్టణంలోని సుభాష్‌గంజ్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించేందుకు వీడియో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి చంద్రశేఖర్, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.