
డీసీసీ పీఠం దక్కేదెవరికో?
కొత్తవారికై తే ఉజ్వల్‌రెడ్డికి అవకాశం! దరఖాస్తులను ఆహ్వానించిన అధిష్టానం దరఖాస్తు యోచనలో పలువురునాయకులు నేడు పార్టీ కీలక సమావేశానికిఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై నేడు స్పష్టత రానుంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నిర్మలారెడ్డినే మరోమారు కొనసాగిస్తారా? లేదా ఈ పదవిలో కొత్త వారిని నియమిస్తారా? అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేకు పడటంతో అధినాయకత్వం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులతోపాటు, జిల్లా కార్యవర్గాన్ని నియమించాలని నిర్ణయించింది. దీంతో ఆదివారం సంగారెడ్డిలో ఆ పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఏఐసీసీ పరిశీలకులు హజరుకానున్నారు. డీసీసీ పదవిని ఆశిస్తున్న వారు ఈ సమావేశంలో దరఖాస్తు చేసుకోవాలని పార్టీ నాయకత్వం శ్రేణులకు సూచించింది. దీంతో ఆసక్తి ఉన్న నాయకులు దరఖాస్తులు చేసుకునే అవకాశాలున్నాయి. పార్టీ అధినాయకత్వం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎవరిని నియమించాలనే ముఖ్యనేతలు, పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలను సేకరించే అవకాశాలున్నాయి.
ఏ వర్గానికి దక్కుతుందో..?
జిల్లాలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం రెండు వర్గాలుగా మారింది. సంగారెడ్డి, ఆందోల్ వంటి ఒకటీ రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ నాయకులు రెండు, మూడు వర్గాలుగా విడిపోయారు. నారాయణఖేడ్‌తోపాటు, పటాన్‌చెరు, జహీరాబాద్‌లలో ఆ పార్టీ ముఖ్యనాయకులు ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు. ప్రతీ ఎన్నికల సమయంలో ఈ వర్గాలను ఏకతాటి పైకి తేవడం, ఆయా నాయకులను సమన్వయం చేయడం పార్టీ అధినాయకత్వానికి తలకు నొప్పిగా తయారవుతోంది. ఈ క్రమంలోనే ఈ డీసీసీ అధ్యక్ష పదవి ఏ వర్గానికి చెందిన నాయకుడికి దక్కుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఉజ్వల్‌రెడ్డి వైపు ముఖ్య నేతల మొగ్గు
ఈ పదవిలో నిర్మలారెడ్డినే కొనసాగించాలనే ఎక్కువ మంది నాయకులు అభిప్రాయ పడుతున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల వరకై నా కొనసాగించాలని పలువురు కీలక నాయకులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఒకవేళ కొత్త వారిని నియమించిన పక్షంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎవరికి పదవి వరిస్తుందనేది నేడు తేలనుంది. మార్చిన పక్షంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఉజ్వల్‌రెడ్డి పేరు తెరపైకి వస్తోంది. సామాజిక సమీకరణాలు మినహాయిస్తే...వైద్యుడైన ఉజ్వల్‌రెడ్డికి ఈ పదవినివ్వడం ద్వారా మేథావివర్గానికి అవకాశం ఇచ్చినట్లవుతుందని అంటున్నారు. అలాగే కాస్త యువ నాయకత్వానికి అవకాశం దక్కినట్లవుతుందని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఉజ్వల్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. షెట్కార్ వర్గీయులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అధినాయకత్వం అభిప్రాయ సేకరణ చేసే అవకాశాలుంటాయని, లేనిపక్షంలో ఏకగ్రీవంగానే ఈ పదవి నియామకం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నిర్మలారెడ్డినే మరోసారికొనసాగిస్తారా!