
నేడు పల్స్ పోలియో
● స్పెషల్ డ్రైవ్‌లో జిల్లా ఎంపిక ● మూడు రోజులపాటు చుక్కల పంపిణీ
సంగారెడ్డి జోన్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు జిల్లాలను ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఎంపిక చేసింది. ఇందులోభాగంగా పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్‌కు సంగారెడ్డి జిల్లా ఎంపికై ంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్ పి.ప్రావీణ్య అధ్యక్షతన ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
1,91,668 మంది చిన్నారులకు పంపిణీ
స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలో 1,91,668 చిన్నారులకు పోలియో చుక్కల మందు పంపిణీ చేయనున్నారు. నవజాత శిశువుల నుంచి ఐదేళ్ల వయస్సు వరకు ఉన్న ప్రతి చిన్నారికి టీకా అందేలా చర్యలు చేపట్టారు. మూడు రోజులపాటు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించేందుకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను వైద్యశాఖ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. మొదటిరోజు ప్రధాన చౌరస్తాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్, గ్రామపంచాయతీ తదితర ప్రధాన ప్రదేశాలను గుర్తించి బూత్‌ల వారీగా పంపిణీ చేశారు. మిగతా రెండు రోజుల్లో ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తారు.
4,548 మంది సిబ్బంది
పల్ పోలియో కార్యక్రమానికి జిల్లాలో 4,548 మంది సిబ్బందిని కేటాయించారు. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ 1,583, అంగన్‌వాడీ 1,505, ఆశా వర్కర్లు 904 మంది సిబ్బందితోపాటు ఇతర వాలంటీర్లను 906 మందిని నియమించారు. వీరితో పాటు 8 మంది ప్రోగ్రాం అధికారులను నియమించి, పర్యవేక్షణ జరుపనున్నారు. రోజు వారీగా పంపిణీ చేసిన వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు.