
పీఎండీడీకేవై పథకంతో రైతులకు మేలు
హాజరైన అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు
కౌడిపల్లి(నర్సాపూర్): పీఎండీడీకేవై పథకంతో రైతులకు మేలు చేకూరనుందని అధికారులు పేర్కొన్నారు. శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నూతనంగా ప్రారంభించిన పీఎండీడీకేవై పథకం కార్యక్రమాన్ని మండలంలోని తునికి కేవీకేలో ఆన్‌లైన్‌లో అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా డీఏఓ దేవ్‌కుమార్ మాట్లాడుతూ... ఈ పథకంతో పీఎం దేశంలోని రైతులు, వ్యవసాయ అభివృద్ధికి రూ.42వేల కోట్ల కేటాయించారని చెప్పారు. అనంతరం రైతులకు కేవీకేలో సాగుచేస్తున్న సేంద్రియ పంటలు, వర్మీ కంపోస్ట్‌ను క్షేత్రస్థాయిలో చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, కేవీకే హెడ్‌అండ్ సైంటిస్ట్ డాక్టర్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్, డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, ఉదయ్‌కుమార్, డాక్టర్ భార్గవి, రైతులు పాల్గొన్నారు.
సీపీఆర్ చేసి..
ప్రాణాలు కాపాడి..
హవేళిఘణాపూర్(మెదక్): ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడారు. వివరాలు ఇలా... మండలంలోని లింగ్సాన్‌పల్లికి చెందిన జ్యోతి కుటుంబీకులతో గొడవపడి ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకొని ఉరి వేసుకుంది. ఈ విషయాన్ని గ్రామస్తులు 100కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసు సిబ్బంది జయానంద్, వరప్రసాద్, రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి ఇంట్లో కొన ఊపిరితో ఉన్న జ్యోతిని కిందకు దించి సీపీఆర్ చేశారు. వెంటనే పోలీసు వాహనంలో హుటాహుటిన మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
ఆపదలో ఆదుకున్న సీఐ
మెదక్ మున్సిపాలిటీ: ఓ కుటుంబానికి ఆపదలో ఆపన్నహస్తం అందించి పోలీసు అధికారి మానవత్వం చాటుకున్నాడు. వివరాలు... మెదక్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం ఈనెల 10న తిరుపతి దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడ ఆ కుటుంబానికి సంబంధించిన వస్తువులు డబ్బులు చోరీకి గురయ్యాయి. దీంతో ఆ కుటుంబం స్వగ్రామం తిరిగివచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ మహేశ్ ఎస్పీ సూచన మేరకు ఆ కుటుంబానికి సురక్షితంగా మెదక్ రావడానికి రూ.4వేల సహాయం చేశారు. కాగా ఆ కుటుంబంలో పెద్ద వారిలో ఒకరు వికలాంగుడు కాగా ఇద్దరు ఆడవాళ్లకు మాటలు రావు. చిన్న బాబుకు మాత్రమే మాటలు వస్తాయి. రైల్వే పోలీస్ సహకారం తీసుకుని వారికి సమయానికి డబ్బులు పంపి వారిని మెదక్‌కి తీసుకొచ్చామని సీఐ తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన కారు
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రవీంద్రనగర్ శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... హైదరాబాద్ నుంచి మల్లారెడ్డి, రాజహంస దంపతులతో పాటు మరొకరు ప్రతాప్‌రెడ్డి కరీంనగర్‌కు సొంత కారులో వస్తున్నారు. ఈ క్రమంలో రవీంద్రనగర్ శివారులో రాజీవ్ రహదారిపై అకస్మాత్తుగా గేదె అడ్డు రావడంతో తప్పించబోయి కారు రోడ్డు కిందకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులను అభినందించిన ఎస్పీ శ్రీనివాసరావు
భార్యాభర్తలతో పాటు మరొకరికి గాయాలు

పీఎండీడీకేవై పథకంతో రైతులకు మేలు

పీఎండీడీకేవై పథకంతో రైతులకు మేలు

పీఎండీడీకేవై పథకంతో రైతులకు మేలు