
పది గేట్ల ద్వారా సింగూరు నీటి విడుదల
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు గత మూడు రోజులుగా వరద పోటెత్తుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీ వరదలు వస్తున్నాయి. మూడు రోజుల నుంచి ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 90,431 క్యూసెక్కుల నీరు రాగా... డ్యామ్‌లో 18 టీఎంసీలను నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి
కొండాపూర్(సంగారెడ్డి): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి ప్రజలకు సూచించారు. శనివారం మండల పరిధిలోని తొగర్‌పల్లి గ్రామ శివారులో నివాసముంటున్న 13 కుటుంబాలను పడవ ద్వారా గ్రామానికి తరలించారు. అనంతరం వారిని గ్రామంలో గల బాలుర వసతి గృహానికి తరలించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు.
జాడిమల్కాపూర్
ఎత్తిపోతలకు జలకళ
జహీరాబాద్ టౌన్: ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాలకు మొగుడంపల్లి మండలంలోని జాడిమల్కాపూర్ ఎత్తిపోతలకు జలకళ వచ్చింది. తెలంగాణ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో జాడిమల్కాపూర్, సజ్జరావుపేట తండాల సమీపంలో వాటర్ ఫాల్ ఉంది. వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో ఎత్తిపోతలకు వరద వస్తుంది. జహీరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఎత్తిపోతలను చూసేందుకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
పరిహారం చెల్లించాలి
సదాశివపేట(సంగారెడ్డి): అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ మంజీరా రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. మంజీరా రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఏఈఓ రవితో కలసి శనివారం పట్టణ పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో వర్షాలకు నష్టపోయిన పసుపు, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అధికారులు జిల్లా వ్యాప్తంగా పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించాలని కోరారు.
భూములను గుంజుకుంటారా?
సీపీఎం నేత చుక్కా రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అభివృద్ధి పేరుతో పేదల భూములనే ఎందుకు గుంజుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రశ్నించారు. ఏళ్ల నుంచి భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న పేదలను భూమి నుంచి వేరు చేసేలా ప్రభుత్వ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. స్థానిక కేకే భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు శనివారం ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ట్రిపుల్ ఆర్ రైతులతో కలిసి ధర్నా చేశారు.

పది గేట్ల ద్వారా సింగూరు నీటి విడుదల

పది గేట్ల ద్వారా సింగూరు నీటి విడుదల