
పత్తి రైతు కన్నీళ్లు
పుడమి తల్లిని నమ్ముకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒడిదుడుకులతో ప్రారంభమైన ఖరీఫ్‌సాగు ముందుకు సాగడం లేదు. అతివృష్టితో పత్తి పంట ఎదుగుదల నిలిచిపోయింది. జిల్లాలో 45 నుంచి 50 రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా పత్తిలో పూత, కాత ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వచ్చిన కాస్త పత్తి కాయలు పగిలి నీరు గారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– మునిపల్లి(అందోల్)
వర్షాలతో పత్తి పంట పూర్తి స్థాయిలో దెబ్బతిందని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని జిల్లాలోని రైతులు వాపోతున్నారు. దెబ్బతిన్న పంటల వివరాలు రాసుకోవడానికి ఒక్క అధికారి రాలేదని మండి పడుతున్నారు. గత సంవత్సరం చెట్టుకు 20 నుంచి 40 కాయల వరకు ఉండేవని, ఈ సారి 10 నుంచి 20 కాయలు కూడా రాలేదని చెబుతున్నారు. కాస్తో కూస్తో ఉన్న పత్తి కాయలు కూడా వర్షం కారణంగా పగిలి పాడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పెట్టుబడులు
పత్తి విత్తనాలు నాటిన నుంచి 180 రోజుల లోపు గడువు ముగుస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. విత్తనాలు నాటిన నుంచి 120 రోజుల వరకు ఎదుగుదల, కాత, పూత, దశకు చేరుకుంటుంది. ఈ సమయంలో వివిధ రకాల ఎరువులు వేస్తుంటారు. సుమారు నాలుగు నుంచి ఐదు సార్లు మొక్క ఎదుగుదలకు, పురుగు నివారణకు మందులు పిచికారీ, ఎరువులను వేస్తారు. కానీ ఈ సారి సుమారు 50 రోజులుగా వర్షం పడుతుండటంతో మందుల వాడకం కూడా తగ్గించగా.. మరి కొందరు వర్షం తగ్గిన సమయంలో ఎరువులు వేశారు. వర్షం దాటికి వేసినవి కూడా పని చేయకుండా పోయాయని పలువురు రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపోగా పంట దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గే పరిస్థితి వచ్చిందని, అప్పుల ఊబిలో కూరుకుపోయామని చెబుతున్నారు.
దిగుబడులు తగ్గవచ్చు..
ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికై నా వర్షాలు తగ్గితే కొంత వరకు ఆలస్యంగా వేసిన చేన్లలో కాత, పూత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
దంచి కొడుతున్న వానలు
నీరు గారిపోతున్న పత్తి
దిగుబడి తగ్గే అవకాశం
ఆందోళన చెందుతున్న అన్నదాతలు