
సమస్యల వలయంలో తండాలు?
అక్కన్నపేట(హుస్నాబాద్): తండాల్లో సమస్యలు తిష్ట వేశాయి. మండలంలోని హాతిరాం అంబనాయక్ తండావాసులు భయంతో వణికిపోతున్నారు. సకాలంలో వైద్యం అందక ఆరు నెలల్లో సుమారు నలుగురు యువకులు మృతి చెందారు. చెరువు కట్ట తెగడంతో తండాకు వచ్చే ప్రత్యామ్నాయ దారి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. ఈ గ్రామ పరిధిలో పంచరాయితండా, ఏన్యతండాలు ఉండగా.. అందులో సుమారుగా 103 ఇండ్లు, 213 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 510వరకు ఓటర్లు ఉన్నారు.
తండాకు రాకపోకలు బంద్
ఈ తండాలన్నీ గండిపల్లి ప్రాజెక్టు అవతలి భాగంలో అనుకొని ఉంటాయి. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. అయితే తండా వాసులంతా ఇతర ప్రాంతాలకు వెళ్లాంటే ఈ ప్రాజెక్టు లోపలి చెరువు కట్ట మీదుగానే రాకపోకలు సాగించాలి. కాగా భారీ వర్షంతో పూర్తిగా చెరువు నిండి కట్ట తెగిపోయింది. దీంతో ప్రస్తుతం రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. ఈ క్రమంలో తండావాసులు బాహ్య ప్రపంచానికి దూరంగా బతకాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగిన చోట మట్టి పోసి మరమ్మతులు చేయించాలని విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అత్యవసరమైతే అంతే?
ఆ తండాలో ఎవరికై నా అనారోగ్య సమస్య వస్తే వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. చిన్న పాటి జ్వరం వచ్చినా సకాలంలో వైద్య సిబ్బంది ఎవరు రావట్లేదని తండావాసులు చెబుతున్నారు. దీంతో వైద్యం చేయించుకునేందుకు వెళ్లలేక లోలోపల బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతూ మరణిస్తున్నారు. ఇటీవల ఇద్దరు యువకులకు సకాలంలో వైద్యం అందక అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. అలాగే పంచరాయితండా, అంబనాయక్‌తండా, ఏన్యా నాయక్ తండాలకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు. దీంతో అంబులెన్స్ కూడా రావట్లేదని తండావాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తెగిన రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వేడుకుంటున్నారు.
తెగిన రోడ్డుతో రాకపోకలు బంద్
దారి లేక.. అంబులెన్స్ రాలేక
వైద్యం అందక ఆరు నెలల్లో నలుగురు మృతి
కన్నెత్తి చూడని అధికారులు

సమస్యల వలయంలో తండాలు?

సమస్యల వలయంలో తండాలు?