
ఖేడ్.. ఇక పాలన దౌడ్
నారాయణఖేడ్: మారుమూల ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, ప్రజా సమస్యల తక్షణ పరి ష్కారమే లక్ష్యంగా ప్ర భుత్వం రాష్ట్రంలో పలు రెవెన్యూ డివిజన్లను సబ్ కలెక్టర్ కార్యాలయాలుగా మారుస్తూ సబ్ కలెక్టర్లను నియమించింది. అందులోభాగంగా జిల్లాలోని నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి 2023వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఉమా హారతిని కేటాయించారు. రాష్ట్రంలో భైంసాకు అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్మూర్‌కు అభిజ్ఞాన్ మాల్వియా, ఖమ్మం జిల్లా కల్లూరుకు అజయ్ యాదవ్, భద్రాచలానికి మృణాళ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా మనోజ్‌ను నియమించారు. ఖేడ్‌కు కేటాయించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఖేడ్‌కు పూర్వ వైభవం!
ఖేడ్ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనకు ముందు కర్ణాటకలో, నిజాం పాలన కింద కొనసాగింది. నాడే డివిజన్ కేంద్రంగా కొనసాగిన ఖేడ్ వికారాబాద్‌పాయగా సాగింది. అప్పట్లో పన్నులను వసూలు చేసి వికారాబాద్‌కు పన్నులు చెల్లింపులు జరిపేది. బీదర్ జిల్లాతో సత్సంబంధాలు కొనసాగేవి. అప్పట్లో వస్తువుల క్రయ, విక్రయాలు, బంధుత్వాలు చాలావరకు కర్ణాటకతో ముడిపడి ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉండటంతో సరిహద్దు గ్రామాలతోపాటు మెజార్టీ మండలాల్లో కన్నడ, మరాఠీ భాషలను మాతృభాష తరహాలోనే మాట్లాడతారు. ఉమ్మడి రాష్ట్రాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో కలిశాక ఖేడ్ నియోజకవర్గ కేంద్రానికి పరిమితమైంది.
2016లో రెవెన్యూ డివిజన్‌గా..
ఖేడ్‌లో ఉప ఎన్నికల సందర్భంగా నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాంత ప్రజలు, విద్యార్థుల కోరిక మేరకు 11 అక్టోబర్ 2016న ఖేడ్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. అప్పటినుంచి పరిపాలన కొనాసాగుతుంది. అంతకుముందు సంగారెడ్డి ఆర్డీఓ పరిధిలో ఉండటంతో ఏ చిన్న పనికై నా జిల్లా కేంద్రం సంగారెడ్డి వెళ్లాల్సి వచ్చేది. ఇక్కడే ఆర్డీఓ ఉండటంతో చాలా పనులు చేసుకోవడం, డివిజన్ స్థాయి అధికారి ఉండటంతో తనిఖీలు, ప్రజా సమస్యలు కొంత పరిష్కారం అయ్యేవి.
సబ్ కలెక్టర్ నియామకంతో మేలు
క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం సులువు
అధికారులు, ప్రజల మధ్య సమన్వయం
ప్రజావాణి ఇక్కడే..
నేరుగా సమస్యపై ఫిర్యాదు
నేడు సబ్ కలెక్టర్‌గా
ఉమా హారతి బాధ్యతల స్వీకరణ
సబ్ కల్టెర్ హోదాతో..
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఖేడ్‌లో సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి ఉండటంతో ప్రజా సమస్యలు తక్షణం పరిష్కారం కాగలవు. జిల్లా కేంద్రానికి ఖేడ్ 85కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రజావాణి, ఇతర సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతూ వెళ్తుంటారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు జిల్లా కేంద్రానికి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ప్రజావాణితోపాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, ఆయా విభాగాల సమస్యలన్నింటినీ సబ్ కలెక్టర్ హోదాలో అధికారి ఇక్కడే పరిష్కరించే వీలుంది. ఏ సమస్యనైనా కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే వీలు సబ్ కలెక్టర్‌కు కలుగనుంది. దీంతో ప్రజలు నేరుగా సమస్యలు వివరించి పరిష్కరించుకునే అవకాశం కలిగింది. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయం ఖేడ్ ప్రజలకు వరంలా మారనుంది. ఆరు మండలాలతో ఖేడ్ డివిజన్ కొనసాగుతుంది. అన్ని మండలాల ప్రజానీకం, ప్రజాప్రతినిధులు, అధికారులకు సబ్ కలెక్టర్ అనుసంధాన కర్తగా ఆయా విభాగాలకు పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు.

ఖేడ్.. ఇక పాలన దౌడ్