
కార్పొరేట్‌కు దీటుగా కేజీబీవీలు
హత్నూర(సంగారెడ్డి): కార్పొరేటుకు దీటుగా కేజీబీవీలను ప్రభుత్వం తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండల కేంద్రంలోని హత్నూర కేజీబీవీలో సోమవారం రాత్రి బస చేశారు. విద్యార్థులతో కలిసి రాత్రి భో జనం చేశారు. భోజనం ఎలా ఉంది..? రోజూ ఇలా ఉంటుందా అంటూ ఆరా తీశారు. కష్టపడి చదివి లక్ష్యాలను సాధించుకోవాలని విద్యార్థినులకు సూచించారు. విద్యాలయంలోని తరగతి గదులను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నూతన మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన చేసి ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎస్‌ఆర్ నిధులతో అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. భవనం మరమ్మతులు, నీటి వసతి, కరెంటు వంటి సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం అయ్యే లా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్థిక స్థోమత లేక ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారులకు శ్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేసేలా చూడాలని సూచించారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారి వెంబడి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ స్వప్న, డీఈఓ వెంకటేశ్వర్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ జయలక్ష్మి, తహసిల్దార్ ఫర్హిన్ షేక్, ఎంపీడీఓ శంకర్, ఎంఈఓ వెంకట్ నరసింహ గౌడ్, ఎంపీఓ యూసుఫ్, ఏపీఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
హత్నూర కస్తూర్బాలో రాత్రి బస