
నల్లవాగు అభివృద్ధి కోసం చర్యలు
కల్హేర్(నారాయణఖేడ్)/కంగ్టి(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి తెలిపారు. నల్లవాగు ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. వానాకాలం పంటల సాగుకోసం ప్రాజెక్టులో నీటినిల్వ పరిశీలించారు. ప్రాజెక్టు కట్టపై చెట్లు తొలగించాలని అభివృద్ధి పనులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఉన్న నీటి ఆధారంగా పంటల సాగుకోసం రైతులతో చర్చించారు. అనంతరం నల్లవాగు గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. భోజన వసతి, విద్యాభోధన గురించి విద్యార్థులను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంగ్టి మండలంలోని తడ్కల్ ప్రాథమిక పాఠశాల భవనంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పేదలకు ఉచిత కంటి పరీక్షలు, వైద్య సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఏఈ శివదయాళ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ తిరుపతయ్య, నాయకులు రమేశ్ చౌహాన్, యాదవరెడ్డి, తుకారాం, జితేందర్‌రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు.
ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి