
ఉరకలెత్తిన ఉత్సాహం
ఉల్లాసంగా హాఫ్ మారథాన్ ● రంగనాయక సాగర్ జనసంద్రం
చిన్నకోడూరు(సిద్దిపేట): హాఫ్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట జనసంద్రంగా మారింది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హాఫ్ మారథాన్ నిర్వహించారు. ఇందుకు సపోర్టింగ్ స్పాన్సర్‌గా సాక్షి మీడియా వ్యవహరించింది. 5, 10, 21 కి.మీ. విభాగాల్లో నిర్వహించిన పరుగు పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన వారు ఆసక్తిగా పాల్గొన్నారు. రన్నర్స్, యువత, ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా పరిగెత్తారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ పరుగులో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలను అందజేశారు.
సాక్షి డాట్ గేమ్స్ అదుర్స్..
రంగనాయక సాగర్‌పై జరిగిన హాఫ్ మారథాన్‌లో సాక్షి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాక్షి డాట్ గేమ్స్ ఆకట్టుకున్నాయి. రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సాక్షి విత్ సెల్ఫీ పాయింట్‌లో ఫొటోలు దిగారు. సాక్షి డాట్ గేమ్‌లో మొదటి ముగ్గురి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంపీ రఘునందన్‌రావుతో పాటు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, పలువురు ప్రముఖులు, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు తదితరులు సాక్షి సెల్ఫీ పాయింట్‌లో ఫొటోలు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు పాల్గొన్నారు.
వ్యాయామం తప్పనిసరి..
డయాబెటిక్ ఇండియాను హెల్త్ ఇండియాగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ప్రస్తుతం మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్న మార్గం వాకింగ్ అన్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే దేశం బాగుంటుందన్నారు. ఆరోగ్యవంతంగా ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలమన్నారు.
50 మారథాన్‌లలో పాల్గొన్నా
ఇప్పటి వరకు 50 మారథాన్‌లలో పాలొని సత్తాచాటాను. ఢిల్లీ, ముంబై, చైన్నె, గుజరాత్, వైజాగ్, హైదరాబాద్‌లలో జరిగిన మారథాన్‌లలో పాల్గొన్నా. గత ఏడాది సిద్దిపేటో మొదటి స్థానంలో నిలిచాను. ఈ సారి 21కే లో రెండో స్థానం సాధించాను.
– రమేశ్ చంద్ర, నాగర్‌కర్నూల్

ఉరకలెత్తిన ఉత్సాహం