
బడి బస్సులు భద్రమేనా!
సంగారెడ్డి క్రైమ్: చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. గతంలో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు, పాఠశాలల యాజమాన్యాలు చేసిన పొరపాట్లతో ప్రమాదాలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు మృతిచెందిన ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల బస్సులో నిర్వహణలో ఈ సంవత్సరం రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రతీ ఏటా పాఠశాలల పునఃప్రారంభం నాటికి బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల అర్హత, బ్యాచ్ లైసెన్స్, అనుభవాన్ని పరీక్ష చేస్తోంది. ఆ తర్వాతే బస్సులు రోడ్ ఎక్కేందుకు అనుమతి ఇస్తుంది.
ప్రైవేట్ యాజమాన్యాల నిర్లక్ష్యం
నిబంధనల ప్రకారం పాఠశాలల పునఃప్రారంభం నాటికి బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించి సిద్ధంగా ఉంచాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నిబంధనలో విఫలమైనా ఏదైనా లోపం ఉన్న ఆర్థికంగా భారం పడుతుందని దూరంగా ఉంటున్నారు. సెలవుల్లో కాకుండా విద్యా సంవత్సరం మధ్యలో తనిఖీలు చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. త్వరగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలని పాఠశాల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. సంగారెడ్డి ఆర్టీఏ పరిధిలోని స్కూళ్లకు సంబంధించిన బస్సులు 649 వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 463 బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇంకా 186 బస్సులు ఫిట్‌నెస్ చేయించుకోవాల్సి ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. అయితే ఫిట్‌నెస్ లేకుండా స్కూల్ బస్సులు తిరిగితే సీజ్ చేస్తామని రవాణా అధికారులు హెచ్చరిస్తున్నారు.
రవాణా సదుపాయానికి
అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
పిల్లల రవాణా సౌకర్యం నిమిత్తం తల్లిదండ్రులు బస్సులను ఆశ్రయిస్తారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్లి తీసుకురావడం యాజమాన్యాల బాధ్యత. బడి బస్సులు భద్రమేనా? అనుమతి ఉందా? సీట్ల సామర్థ్యం ఎంత? వంటి అంశాలను తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. లేదంటే సొంతంగా రవాణా ఏర్పాటు చేసుకోవాలి.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి
వందల సంఖ్యలో
ఫిట్‌నెస్ లేని వాహనాలు!
పట్టుపడితే సీజ్ చేస్తామని
రవాణా శాఖ అధికారుల హెచ్చరిక
పాటించాల్సిన నియమాలు..
విద్యా సంస్థలు బస్సులు విధిగా పసుపు రంగులోనే ఉండాలి.
బస్సుపై ఎడమవైపు వెనక భాగంలో సృష్టంగా కనిపించేలా విద్యా సంస్థ పేరు చిరునామా ఫోన్ నంబర్, రాయాలి.
బస్సుల్లో సీటింగ్ సామర్థ్యానికి అనుగుణంగా పిల్లలను కూర్చోబెట్టాలి
విద్యార్థులు ఎక్కడానికి దిగడానికి ఒక సహాయకుడిని(అటేండర్)తప్పనిసరిగా నియమించాలి
డ్రైవర్ వయసు 55ఏళ్లు మించరాదు. ఐదేళ్ల నుంచి పదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి
డ్రైవర్‌కు రక్తపోటు, మధుమేహం, కంటిచూపు వంటి పరీక్షలు మూడు నెలలకు ఒకసారి చేయించాలి
డ్రైవర్‌కు బ్యాచ్ నంబర్ కలిగిన లైసెన్స్ ఉండాలి
అత్యవసర ద్వారం ఉండాలి. డ్రైవర్, అటెండర్‌ఫోన్ నంబర్ విధిగా ఉండాలి
ఫిర్యాదులకు ప్రతీ బస్సులో పుస్తకం ఉంచాలి. వాటిని యాజమాన్యం పరిష్కరించాలి
ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో
ఉండాలి
ప్రతీ బస్సులో రిజిస్ట్రేషన్, కాలుష్యం, భీమా పత్రాలను బస్సులో ఉంచాలి.
ఉల్లంఘిస్తే చర్యలే...
విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లే ప్రతీ బస్సు నిబంధనలకు లోబడి ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. పాఠశాల పునఃప్రారంభమైన రోజు నుంచే తనిఖీలు నిర్వహిస్తాం. పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి.
–వెంకటరమణ, సంగారెడ్డి ఆర్టీఓ