కౌలు రైతుకేదీ భరోసా?
● ప్రభుత్వం నుంచి అందని సాయం ● బ్యాంకులు సైతం కనికరించని వైనం ● వడ్డీ వ్యాపారులపైనే భారం
జిల్లాలో 50 వేలకు పైగా కౌలు రైతులు
జిల్లాలో లక్షన్నరకు పైగా పట్టాదారు రైతులు వుండగా అందులో సుమారు 50 వేలకు పైగా కౌలు రైతులున్నారు. ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ, పంటలు పండక కౌలు రైతులు నష్టం చవిచూడాల్సి వస్తే రుణాల వసూళ్ళ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం వుంటుంది. దీంతో బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. తీరా పంటలు పండి చేతికి వచ్చే సమయానికి పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో కౌలు రైతులు తీవ్ర నష్టాలను చవి చూడటమే కాకుండా మరి కొంతమంది కౌలు రైతులు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జిల్లాలో కోకొల్లలు.
కొండాపూర్(సంగారెడ్డి): ఎన్ని ప్రభుత్వాలు మారిన కౌలు రైతుల బతుకులు మాత్రం మారడం లేదు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం పట్టాదారు రైతులకు పెట్టుబడి సహాయం అందించేది. కౌలు రైతులు భూమిని కౌలు తీసుకుని పంటలను సాగు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు వారికి ఏ మాత్రం సహాయం అందించడం లేదు. చివరికి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లితే ప్రభుత్వం అందించే నష్ట పరిహారం కూడా పట్టాదారు రైతులకే ఇస్తుండటంతో కౌలు రైతుల బతుకులు దుర్భరంగా మారుతున్నా యి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానని చెప్పిన మాట నీటిపై రాతల్లాగే మిగిలిపోయింది. ప్రజా ప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా కౌలు రైతుల ఊసే ఎత్తడం లేదు.


