కొత్త సర్పంచుల సందడి
● ఖేడ్‌లో విజయోత్సవ ర్యాలీలు
● నేతలను కలిసి సత్కారం
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తల రాకతో నారాయణఖేడ్ పట్టణం గురువారం సందడిగా మారింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఆయా పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఎన్నికై న ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, నాయకులు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు నగేష్ షెట్కార్, సుధాకర్‌రెడ్డిలను కలిసి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ప్రతిగా నాయకులు కూడా నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సత్కరించారు. బీఆర్‌ఎస్ మద్దతు గెలుపొందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని కలిసి సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్‌లు భారీ సంఖ్యలో గెలుపొందడంతో ఎమ్మెల్యే నివాసం గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకొని భాజా భజంత్రీలతో తరలివచ్చారు. పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. జనం రాకతో రద్దీగా మారి ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు తగు బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనం రాకతో నిండిపోయాయి.


