మూడో విడత.. చూడ ముచ్చట
భర్త సర్పంచ్..
భార్య ఉపసర్పంచ్
ఏకాభిప్రాయం కుదరక మధ్యే మార్గం
నారాయణఖేడ్: పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చె నంట.. అన్న చందంగా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ గ్రామ సర్పంచ్‌గా బిరాదర్ విజయ్ కుమార్ విజయం సాధించారు. మొత్తం 7 వార్డులు కాంగ్రెస్ సభ్యులు గెలుపొందగా, బీఆర్‌ఎస్ ఒక వార్డులో గెలిచింది. గురువారం నిర్వహించిన ఉపసర్పంచ్ ఎన్నికలో వార్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆరుగురు వార్డు సభ్యులు ఉప సర్పంచ్ పదవి నాకంటే నాకంటూ వారిమధ్య వాగ్వాదం జరిగింది. చివరకు సర్పంచ్‌గా విజయం సాధించిన విజయ్ కుమార్ తన భార్య బిరాదర్ శోభ 4వ వార్డు సభ్యురాలిగా ఎన్నిక కావడంతో మధ్యేమార్గంగా వార్డు సభ్యులు ఆమెను ఉపసర్పంచ్‌గా ఎన్నుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చి ఎన్నుకున్నారు. లక్కు అంటే ఇదే మరి.
హ్యాట్రిక్ సర్పంచ్
వెంకటేశం
నారాయణఖేడ్: మండలంలోని సత్తెగామ గ్రామ సర్పంచ్‌గా తెనుగు వెంకటేశం హ్యాట్రిక్ విజయం సాధించారు. మూడేళ్లుగా ఆయన సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తున్నాడు. గతేడాది సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌రెడ్డిపై 98 ఓట్ల ఆధిక్యతతో బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీచేసిన వెంకటేశం విజయం సాధించారు. సర్పంచ్‌గా ఉన్న గులాం రసూల్ మరణంతో 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో వెంకటేశం మొదటి సారి సర్పంచ్‌గా గెలుపొందారు. అనంతరం రెండేళ్లకు 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెనుగు వెంకటేశం ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరిగిన పోటీలో అవలీలగా గెలుపొందారు.
విజయం.. పరాజయం
న్యాల్‌కల్(జహీరాబాద్): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు మాజీలు గెలుపొందగా.. మరి కొందరు ఓటమి పాలయ్యారు. బసంత్‌పూర్ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విజలక్ష్మి, చాల్కి మాజీ సర్పంచ్ జనార్ధన్‌రెడ్డి, గుంజోటి మాజీ ఎంపీటీసీ సభ్యుడు దెశెట్టి పాటిల్, మిర్జాపూర్(బి) మాజీ సర్పంచ్ ఎక్కెల్లి నిర్మాలరెడ్డి విజయం సాధించారు. గుంజోటి మాజీ సర్పంచ్ చెన్నమ్మ, మామిడ్గి మాజీ సర్పంచ్ రాణెమ్మ, ముంగి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, న్యాల్‌కల్ మాజీ సర్పంచ్ గంగమ్మ, రేజింతల్ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మల్లిక, టేకూర్ మాజీ సర్పంచ్ చంద్రకళ ఓటమి పాలయ్యారు.
చిన్న వయస్సు..
పెద్ద బాధ్యత
23 ఏళ్లకే సర్పంచ్‌గా గీతాపాటిల్
నారాయణఖేడ్: ఖేడ్ మండలం నాగాపూర్ సర్పంచుగా 23 ఏళ్ల వయస్సుగల పట్లోళ్ల గీతాపాటిల్ ఎన్నికయ్యారు. నాగాపూర్ స్థానం ఆన్ రిజర్వుడ్ మహిళకు కేటాయించారు. కాంగ్రెస్ మద్దతుతో గీత పాటిల్, ఆమెకు పోటీగా బీఆర్‌ఎస్ తరఫున సంగీతబాయి నిలువడంతో గీతా 28 ఓట్ల ఆధిక్యతతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అతిచిన్న వయస్సులో సర్పంచుగా ఎన్నికై న గీతా పాటిల్‌ను పలువురు అభినందిస్తున్నారు.
అన్నపై తమ్ముడి విజయం
నారాయణఖేడ్: రాజకీయాల్లో బంధువులు ప్రత్యర్థులుగా, మిత్రులు శత్రువులుగా మారుతారనేందుకు అంత్వార్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శనం. ఈ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఇరువురు సోదరులు పోటీ పడ్డారు. పాటిల్ బసవకుమార్, ఇతని సోదరుడు పాటిల్ సంగమేశ్వర్ బరిలో నిలవగా.. బీఆర్‌ఎస్ మద్దతుతో సాలమన్ పోటీ పడ్డారు. 85 ఓట్ల ఆధిక్యంతో బసవకుమార్ అంత్వార్ సర్పంచ్‌గా విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున ఇద్దరు సోదరులు పోటీ పడడంతో పార్టీ పెద్దలు ఎవరూ ప్రచారానికి రాలేదు. గెలిచి వచ్చిన వారి మెడలో దండ వేస్తామని చెప్పారు.
కొత్త పంచాయతీ కొత్త సర్పంచ్
న్యాల్‌కల్(జహీరాబాద్): మండలంలో నూతనంగా ఏర్పడిన తాట్‌పల్లి గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. నూతనంగా ఏర్పడిన పంచాయతీలో మొదటిసారి ఎన్నికలు జరగడం, అందులో మొదటిసారి సర్పంచ్‌గా, వార్డు సభ్యులుగా ఎన్నిక కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. 277 మంది ఓటర్లున్న గ్రామంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో 257 ఓట్లు పోలయ్యాయి. చిమ్నాపూర్ రిబిక విజయం సాధించారు. మొదటి సారి జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన తమ పేర్లు చిరస్థాయిగా ఉంటాయని వారు తెగ సంబుర పడుతున్నారు. కాగా గ్రామానికి తొలి సర్పంచ్ కావడం ఆనందంగా ఉందని సర్పంచ్ రిబిక అన్నారు. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.
ఆటో డ్రైవర్ భార్యకు వరించిన సర్పంచ్ పీఠం
కంగ్టి(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్ సారంగి లాలు భార్య అనూష సర్పంచ్‌గా విజయం సాధించారు. ఇన్నాళ్లు గృహిణిగా, వ్యవసాయ కూలీ పనులు చేస్తున్న ఆమె.. పల్లె ప్రథమ పౌరురాలిగా ఎన్నికై ంది. దీంతో అనూషతో పాటు కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని కొత్త సర్పంచ్ తెలిపారు.
కూలీ నుంచి
సర్పంచ్ దాకా..
కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవి నిరుపేద వ్యవసాయ కూలీ పనులు చేసుకొనే వారికి వరించింది. తండాలు గ్రామ పంచాయతీలుగా మారడంతో పాటు రిజర్వేషన్ సీట్లు సైతం మహిళలకు కలిసొచ్చింది. మండలంలోని ఎడ్లరేగడి తండాలో లంబాడి ఇరికిబాయి, జీర్గితండాలో రాథోడ్ యమునాబాయి, చందర్‌తండాలో జాదవ్ శాంతాబాయి, చాప్టా(బీ)లో మోతిబాయి, రాసోల్‌లో రాజవ్వ, సుక్కల్‌తీర్థ్‌లో మాల సంగీత, హోబాతండాలో రాథోడ్ రంగీబాయిలు గతంలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తున్న వారే. ప్రస్తుతం సర్పంచ్ పదవి వరించింది. సర్పంచ్ పీఠాన్ని అధిరోహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


