విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి
● కలెక్టర్ ప్రావీణ్య
● రాష్ట్రస్థాయి 11వ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
పటాన్‌చెరు టౌన్: విద్యార్థినిలు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం ఇస్నాపూర్ తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన 11వ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యజీవితంలో అమ్మాయిలకు క్రీడలు, ఫిట్‌నెస్ అత్యంత అవసరమని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ల్లో క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా అమ్మాయిలు శారీరక–మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో గురుకుల కోఆర్డినేటర్ కల్పన, పటాన్‌చెరు తహసీల్దార్ రంగారావు పాల్గొన్నారు.


