చేయి కలిపేద్దామా..!
● అధికార పార్టీలో చేరేందుకు మొగ్గు
● ఇలా గెలిచిన వారిలో కాంగ్రెస్ రెబల్సే ఎక్కువ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలోకి దిగి విజయం సాధించిన సర్పంచులు.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధాన పార్టీల మద్దతు లేకుండానే సొంత ఇమేజ్‌తో గెలిచిన వీరు తమ పదవీకాలం సజావుగా కొనసాగాలంటే అధికార పార్టీతో ఉండాలనే యోచనలో ఉన్నారు. జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా, మూడు విడతల్లో ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు 35 మంది స్వతంత్రులు సర్పంచులుగా గెలిచారు. ఏ పార్టీ మద్దతు లేకుండా బరిలోకి దిగి ప్రధాన పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులను ఓడించారు. ఇలా స్వతంత్రులుగా బరిలోకి దిగిన అభ్యర్థులు చాలా మటుకు కాంగ్రెస్ రెబల్సే ఎక్కువగా ఉన్నారు. వీరు పార్టీ మద్దతును ఆశించారు. అయితే మరొకరికి పార్టీ మద్దతు లభించడంతో రెబల్స్‌గా పోటీలో కొనసాగారు. వీరిని బరిలోంచి తప్పించేందుకు ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు చాలా ప్రయత్నాలు చేశారు. నామినేషన్లను ఉపసంహరించుకుని పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థికి ఎన్నికల్లో సహకరించాలని ఒత్తిడి తెచ్చారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని బుజ్జగించారు. ఇవేవి పట్టించుకోకుండా ఈ స్వతంత్రులు బరిలో నిలిచిన వీరు ప్రధాన పార్టీ మద్దతు అభ్యర్థులకు దీటుగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఎట్టకేలకు విజయం సాధించారు. ఇలా స్వతంత్ర సర్పంచులు ఇప్పుడు కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
పనులు జరగాలన్నా..
అధికార పార్టీ వైపు ఉంటేనే అధికారులు పూర్తి స్థాయిలో తమకు సహకరిస్తారనే యోచనలో స్వతంత్ర సర్పంచులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చు చేసి గెలిచినప్పటికీ తమ పదవీకాలాన్ని సజావుగా పూర్తి చేసుకోవాలంటే అధికార పార్టీలో ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ధోరణితో ఉన్నారు. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
స్వతంత్ర సర్పంచులతో ప్రధాన పార్టీలు గాలం వేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు ఈ స్వతంత్ర సర్పంచులతో టచ్‌లో ఉంటున్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచులుగా గెలిచిన వీరికి గ్రామాల్లో మంచి పట్టున్నట్లు స్పష్టమవడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగం ఉంటుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొందరు స్వతంత్ర సర్పంచులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలను కలిసి వస్తుండటం గమనార్హం.


