కొలువుదీరనున్న కొత్త సర్పంచ్‌లు
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం పూర్తవడంతో నూతన సర్పంచ్‌లకు పదవీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈనెల 22న పంచాయతీ పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత కొత్త పాలక మండళ్లు కొలువు దీరనున్నాయి. కేంద్రం నిధులకు ఢోకా టేకుండా పోతుంది. దీంతో పల్లెలు ప్రగతి బాట పట్టనున్నాయి. ఇప్పటి వరకు నెలకొన్న స్తబ్ధత వీడనున్నది. మూడు విడతల్లో గెలుపొందిన సర్పంచ్‌లు అందరికీ ఇప్పటికే ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల మొదటి సమావేశం తేదీగా 22ను ప్రకటిస్తూ పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్ జి.సృజన ఇప్పటికే నోఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశం తేదీ నుంచి వీరి పదవీకాలం మొదలై ఐదేళ్లపాటు కొనసాగుతుంది. మూడు విడతల్లో గెలుపొందిన సర్పంచ్‌లు అందరికీ ఒకే తేదీని ప్రకటించింది. వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగని పంచాయతీలకు సంబంధించి విడిగా మరో తేదీని ప్రకటించనున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో తొలి పాలక మండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో సందడి నెలకొంది. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు.
అభివృద్ధిపై గంపెడాశ
గ్రామాల్లో కొత్త పాలక వర్గాల రాకతో సందడి నెలకొంది. ప్రజల్లో కూడా తమ సమస్యలు తీరుతాయనే విశ్వాసం కన్పిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ వచ్చిన నేపథ్యంలో కొత్త పాలక మండళ్లపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. పల్లెలు కూడా అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ దిశగా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనుంది.
సర్పంచ్‌ల ప్రధాన బాధ్యతలు
గ్రామంలోని ప్రజలకు సురక్షిత నీరు అందించడం పంచాయతీ ప్రధాన కర్తవ్యం. అనేక వ్యాధులకు కలుషిత నీరే ప్రధాన కారణంగా ఉంటుంది. ప్రతి గడపకు సురక్షితమైన నీరందించేలా కృషి చేయాలి. మిషన్ భగీరథ ట్యాంకుల శుభ్రం, పైప్‌లైన్ల లికేజీ వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అందుకు చెత్త నిర్వహణతో పాటు డ్రైనేజీల్లో మురుగు సజావుగా సాగేలా చూడాలి. గ్రామాల్లో అందరికీ ఏదో ఓ రకంగా ఉపాధి లభించేలా ప్రయత్నించాలి. ఇందుకోసం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం సమన్వయం చేసుకోవాలి. విద్యపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ అందుబాటులో ఉన్న విద్యా వంతులను పరిశీలించాలి. లేని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేయాలి. పల్లెల్లోనే విద్యార్థులకు శారీరక శ్రమకు క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలి. గ్రామంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా చూడాలి. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందే ఏర్పాట్లు చేయాలి. ప్రతీ నెల గ్రామ పంచాయతీ సమావేశం, రెండు నెలలకోసారి తప్పనిసరిగా గ్రామసభ నిర్వహించాలి. ప్రజా సమస్యలు అందులో విస్తృతంగా చర్చించాలి.
22న ప్రమాణ స్వీకారం
ఆరోజు బాధ్యతలు స్వీకరించనున్న
సర్పంచ్, వార్డు సభ్యులు
నాటి నుంచి ఐదేళ్ల పదవీకాలం
పల్లెప్రగతిపై ప్రజల్లో బోలెడాశలు


