ఎఫ్‌పీఓ సభ్యత్వంతో ఎన్నో ప్రయోజనాలు
ఉమ్మడి మెదక్ జిల్లా
డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి
ములుగు(గజ్వేల్): రైతులు ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్)లో సభ్యులుగా చేరడంతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ములుగు పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి తెలిపారు. ములుగులోని పీఏసీఎస్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల ఆర్థిక అభివృద్ధి, పంటలకు మంచి ధరలు, ప్రభుత్వ పథకాల లబ్ధి, ఆధునిక వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ములుగు పీఏసీఎస్‌కు ఎఫ్‌పీఓను అనుసంధానం చేశామన్నారు. రైతులు రూ.2,990 వాటాదనం చెల్లించి పీఏసీఎస్‌తో పాటు ఎఫ్‌పీఓలో సభ్యులుగా చేరినట్లయితే ప్రభుత్వం ద్వారా అదనంగా మరోరూ.2వేలు ఈ క్విటీ గ్రాంట్ పొందవచ్చన్నారు. అంతే కాకుండా సభ్యులుగా చేరిన రైతులకు పీఏసీఎస్ పాలకవర్గ ఎన్నికల్లో ఓటు హక్కుసైతం కల్పించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎఫ్‌పీఓ సేవలను వినియోగించుకోవాలని కోరారు.


