శునకాలకు వ్యాధులు
నంగునూరు(సిద్దిపేట): శునకాలు వ్యాధుల బారిన పడుతున్నాయి. వ్యాధులతో బక్కచిక్కి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న వీటి ఆకారం చూసి జనాలు హడలిపోతున్నారు. దురద వల్ల శరీరంపై గాయాలు కావడం, రక్తం, తెల్లని సోన కారుతుండటమేకాక.. రెండు నెలలుగా ఇతర శునకాలకు ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో ఏ గ్రామంలో చూసినా వందల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. గుంపులు, గుంపులుగా తిరుగుతూ కొత్తవారు కనబడితే వెంట పడి దాడులు చేస్తున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు గ్రామంలో తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారులపై వాహనాల వెంట పడడతో భయాదోళకు గురవుతున్న వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఇతర కుక్కలకు వేగంగా వ్యాపి
నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల చర్మంపై వెంట్రుకలు రాలిపోయి, నల్లని, ఎర్ర మచ్చలతో పొలుసులు ఏర్పడుతున్నాయి. శరీరంపై పలు చోట్లు గాయాలు కావడంతో రక్తం కారుతూ చీము రావడంతో ఇన్‌ఫెక్షన్ వల్ల రక్కుకుంటూ వింతగా ప్రవరిస్తున్నాయి. చర్మ వ్యాధుల భారిన పడడంతో బక్కచిక్కి నడవలేని స్థితికి చేరుకోగా మిగతా వాటితో కలసి తిరగడంతో వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. గాయాలపై ఈగలు వాలడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అలాగే రేబిస్ సోకితే మరింత ప్రమాదం. అధికారుల స్పందించి వీధి కుక్కలకు చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు.
చికిత్స అందిస్తాం
శునకాలకు ఏడు రకాల చర్మ వ్యాధులు సోకే అవకాశం ఉంది. కుక్కలకు వ్యాధి వేగంగా విస్తరించడం చూస్తుంటే సోరోసిస్, సార్క్‌పిక్ మెంజ్ సోకినట్లు తెలుస్తోంది. మనుషులకు సోకే అవకాశం లేనందున ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. శునకాలను పశువైద్య శాలకు తెస్తే చికిత్స చేస్తాం.
– ప్రశాంత్‌రెడ్డి, వెటర్నరీ వైద్యుడు
నంగునూరు
చర్మ రోగాల బారిన ఊర కుక్కలు
రెండు నెలలుగా వేగంగా వ్యాప్తి
భయాందోళనలో ప్రజలు
శునకాలకు వ్యాధులు


