యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ కార్మికులు మరణిస్తుంటే కార్మికశాఖ పట్టనట్లుగా వ్యవహరిస్తుందని ిసీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య ఆరోపించారు. గురువారం మండలంలోని చెట్లగౌరారం, రంగాయపల్లి శివారులో గల ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమలో ఈనెల 15న లాడల్ పేలి ఇద్దరు కార్మికులు మృతిచెందిన విషయంలో ప్రమాదస్థలాన్ని పరిశీలించడానికి బృందంతో కలిసి వచ్చారు. కాగా పరిశ్రమ యాజమాన్యం వారిని పరిశ్రమలోకి అనుమతి ఇవ్వలేదు. దీంతో గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్మికులతో మాట్లాడి ప్రమాద తీరుపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కార్మికులకు కనీస భద్రత చర్యలు తీసుకోకుండానే పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని ఆరోపించారు. కాగా వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలేదని, కార్మిక చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమ యాజమాన్యాన్ని శిక్షించే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్‌రావు, జిల్లా అధ్యక్షుడు బాలమణి, కార్యదర్శి మల్లేశం, ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ిసీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య


