
నగదు స్వాధీనం చేసుకొని రశీదు ఇస్తున్న పోలీసులు
పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని కోళాపల్లి పాత టోల్‌గేట్ (చెక్‌పోస్ట్) వద్ద వాహనాల తనిఖీల్లో పోలీసులు నగదు పట్టుకున్నారు. మహారాష్ట్ర వాసి షేక్ సమీర్ వద్ద రూ.2 లక్షలు, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో వాహనంలో గౌరవ్ ప్రకాష్ నుంచి రూ.98,400లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువగా నగదు తీసుకెళ్లవద్దని ఎస్‌ఐ శంకర్ తెలిపారు. పట్టుబడిన నగదును సంగారెడ్డిలోని గ్రీవెన్స్ కమిటీలో డిపాజిట్ చేశారు.
ఇసుక డంప్‌లపై దాడులు
బెజ్జంకి(సిద్దిపేట): ఇసుక డంప్‌లపై మంగళవారం సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, బెజ్జంకి పోలీసులు దాడులు చేశారు. మండలంలోని గాగిళ్లాపూర్ శివారులో అక్రమంగా నిల్వ ఉన్న 200 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అక్రమ నిల్వలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
యువతి అదృశ్యం
టేక్మాల్(మెదక్): యువతి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని తంపులూర్‌లో జరిగింది. ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాయికోటి సాయిలు తన భార్య, చిన్నకుమార్తెతో కలిసి గ్రామంలోని దుర్గమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్న నాటకం చూడటానికి సోమవారం రాత్రి వెళ్లారు. తిరిగొచ్చి ఇంట్లో చూస్తే పెద్ద కుమార్తె సుమలత కనిపించడం లేదు. ఆమె సెల్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో తెలిసిన వారి ఇళ్లతోపాటు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో మంగళవారం తండ్రి నాయికోటి సాయిలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని వారు దర్యాప్తు చేస్తున్నారు.
పాత నేరస్తుడికి
జీవిత ఖైదు
పటాన్‌చెరు టౌన్: మహిళను హత్యచేసిన కేసులో పాత నేరస్తుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్ది జిల్లా కంది మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు 2019 జూలై 11వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా గందీడ్ మండలం నాంచర్ల గ్రామానికి చెందిన అంజులమ్మ అనే మహిళను పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామం లింగసానికుంట వద్దకు తీసుకొచ్చి గొంతు నులిమి హత్య చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 10 హత్యలు, 3 దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని సంగారెడ్డి రెండో అడిషనల్ డిస్టిక్ సెషన్ కోర్టులో హాజరపరచగా జీవిత ఖైదుతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కృష్ణార్జున్ తీర్పు ఇచ్చారు.

సుమలత