ఎవరెస్ట్‌ ఎక్కడం అంత ఈజీనా?.. ప్రతీ లెవల్‌ ఓ క్లైమాక్సే! చదివితే మీకే తెలుస్తుంది

What Human Can Learn From Mount Everest - Sakshi

ఎవరెస్ట్‌.. ఒక ప్రత్యేకం. అది ఎక్కడమంటే ఒక మినీ యుద్ధం చేసినట్లే!. అధిరోహించిన ప్రతిసారీ ఓ  కొత్త అనుభవం పంచుతుంది. ఆ అనుభవం ఓ కొత్త పాఠం నేర్పిస్తుంటుంది. అదే సమయంలో కొత్త సవాళ్లనూ ముందుంచుతుంది. ఆకాశమే హద్దుగా.. పర్వత శిఖరాన్ని అధిరోహించే వాళ్లే కాదు, అక్కడి ప్రతికూల పరిస్థితులకు ఏమాత్రం తీసిపోని సవాళ్లను లైఫ్‌లో దాటుకుంటూ ముందుకెళ్లాలనుకునే వాళ్లు కూడా ‘ఎవరెస్ట్‌’ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు మరి!. 

మౌంట్‌ ఎవరెస్ట్‌.. ఆకాశానికి సమీప భూభాగం. వెండి కొండలా ధగ ధగా మెరిసే అద్భుత పర్వతం. ఆ శిఖరాగ్రాన్ని చేరి నిలబడి చూస్తే ఎలా ఉంటుంది?.. మొత్తం ప్రపంచమే మనిషి పాదాల కింద ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి మహోన్నత శిఖరాన్ని ఎక్కడమంటే ఆషామాషీ కాదు. కఠోర శిక్షణ తీసుకోవాలి. అంతకు మించి గుండెల నిండా ధైర్యం ఉండాలి. లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి.. గెలిచి తీరాలన్న పంతంతో ముందుకెళ్లాలి. మానవతీతులకు సాధ్యమేనా? అనుకున్న సమయంలో.. ఈ పర్వతాన్ని అధిరోహించి ‘మనిషి తల్చుకుంటే ఏదైనా సాధ్యమే’ అని ప్రపంచానికి చాటి చెప్పిన హీరోలిద్దరున్నారు. వాళ్లెవరో కాదు. న్యూజిలాండ్ కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ- భారత్ కు చెందిన టెన్జింగ్ నార్గే. ఇప్పటి  సాంకేతికత, ఆధునిక పరికరాలు, పనిముట్లు, సౌకర్యాలు లేనిరోజుల్లో ఈ ఇద్దరూ ఎవరెస్ట్ మీద తమ జెండాలు పాతారు. అది.. 1953 మే 29 తేదీ సరిగ్గా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో.. చరిత్రలో లిఖించదగ్గ క్షణాలను నమోదు చేశారు హిల్లరీ-నార్గేలు. ఈ ఇద్దరిలోనూ శిఖరం పై మొదట కాలు మోపింది మాత్రం హిల్లరీనే.

పేరెలా వచ్చిందంటే.. 
ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. సముద్ర మట్టానికి 29 వేల అడుగుల ఎత్తులో.. నేపాల్ -టిబెట్ సరిహద్దులో ఉంది.  టిబెటన్లు దీన్ని కోమో లాంగ్మా అని పిలుస్తారు. దానర్థం మాతృ దేవత అని. చైనా వాళ్లు జుము లాంగ్మా అంటారు. హోలీ మదర్ అని చైనీయుల ఉద్దేశం. నేపాలీలేమో సాగర మాత అని పిలుస్తుంటారు. అప్పటివరకు కాంచన్ జంగా  ప్రపంచంలోకెల్లా.. అత్యంత ఎత్తైన శిఖరమని అంతా పొరబడ్డారు. ఆ సమయంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన జార్జి ఎవరెస్ట్‌.. అంతకు మించి ఎత్తైన ఓ శిఖరం ఎత్తు తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1850లో నికొల్సన్ అనే ఉద్యోగికి ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. ఆరేళ్లపాటు శ్రమించి.. నికొల్సన్ తన ఆపరేషన్ తన బాధ్యతలు పూర్తి చేశారు. అలా జార్జి ఎవరెస్ట్‌ పేరు మీద.. ప్రపంచానికి మౌంట్‌ ఎవరెస్ట్‌గా పరిచయమైంది. అయితే.. ఎవరు ఎలా పిలిస్తేనేం ఈ పర్వతమైతే పలుకుతుందా?. గంభీరంగా అలా ఉండిపోతుంది అంతే!.  

ఎవరెస్ట్‌ను అధిరోహిస్తే.. పేరు వస్తుందన్న మాట వాస్తవమే. కానీ, ఆ పని అంత సులువు కాదు. కాకలు తీరిన పర్వతారోహకులకు సైతం ఇదొక టఫ్‌ ఛాలెంజ్. ఎత్తుకు వెళ్లే కొద్దీ.. అన్నీ సమస్యలే స్వాగతం పలుకుతుంటాయి. పైగా ప్రతికూల వాతావరణం సవాళ్లు విసురుతుంటుంది. పచ్చిగా చెప్పాలంటే.. ప్రాణాలతో చెలగాటం.  ఏమాత్రం తేడా జరిగినా అంతే!. ఎవరెస్ట్‌ అధిరోహించే క్రమంలో.. ఎనిమిది వేల అడుగుల ఎత్తు దాటితే దాన్ని డెత్ జోన్ అంటారు. అదో మృత్యు శిఖరం. అక్కడ గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటుందంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. ఆక్సిజన్‌ బాటిల్స్‌లో తేడాలు జరిగినా అంతే!. ఈ పరిస్థితుల్లో ఇంకా పైకి వెళ్లడం.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. అక్కడి నుంచి కిందకు తిరిగి వస్తే అదో గొప్ప. అంత ప్రమాదమని తెలిసినా.. క్లైంబర్స్‌కు ఎవరెస్ట్‌ మీద మోజు తగ్గదు. సాహసానికి లభించే అరుదైన విజయానందం మరొకటి ఉంటుందా? అంటారు.  అయితే.. ఆ మోజే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది.

ఆకాశానికి నిచ్చెన.. 
ఎవరెస్ట్ ఎక్కడమంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే. నిచ్చెన ఎక్కేటప్పుడు తప్పటడుగు ఒక్కటి పడినా ఖతం. వాతావరణం ఎదురు తిరిగినా డేంజరే. ఎవరెస్ట్ ఎక్కడంలో బోలెడు రికార్డులు ఉన్నాయి. అన్నే విషాదాలూ ఉన్నాయి. గుండెల నిండా సాహసాన్ని నింపుకుని వేల అడుగుల ఎత్తు ఎక్కిన క్లైంబర్స్ ఎవరెస్ట్ మీదనే చివరి ఊపిరి పీల్చిన విషాద ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఓ దుర్ఘటన మాత్రం ఎవరెస్ట్ చరిత్రలోనే అత్యంత ట్రాజిక్ ఇన్సిడెంట్ గా మిగిలిపోయింది.

ఎ‘వరెస్ట్‌’ 1996.. 
1996, మే 11. మన పర్వతారోహణ చరిత్రలో ఓ బ్లాక్ డే. ఒకేరోజు ఎనిమిది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పై ఊపిరి వదిలారు. మరణించిన వాళ్లలో మనవాళ్లు ముగ్గురు, అమెరికా-న్యూజిలాండ్-జపాన్ దేశాల వాళ్లు ఐదుగురు ఉన్నారు. ఈ ప్రమాదం మాత్రమే కాదు.. 1996 సీజన్‌లో ఎవరెస్ట్‌ అధిరోహణలో మొత్తం పదిహేను మంది కన్నుమూశారు. ఎవరెస్ట్ చరిత్రలో ఓ సీజన్‌లో ఇంతమంది  చనిపోవడం అదే మొదటిసారి!. 

ఏం జరిగిందంటే..! 
అడ్వెంచర్ కన్సల్టెంట్స్- మౌంట్ మ్యాడ్‌నెస్ అనే రెండు ఏజెన్సీలతో పాటు జపాన్-టిబెట్‌లకు చెందిన పర్వతారోహకులు ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధపడ్డారు. మే 10వ తేదీన అంతా పర్వతం పైకి బయలుదేరారు. ఆ రాత్రికి క్యాంప్ ఫోర్ చేరారు. ఆ ఎత్తు 7,900 మీటర్లు. మధ్యాహ్నం తర్వాత  ప్రమాదం అన్నివైపుల నుంచి ముంచుకొచ్చింది. ఎనిమిది మందిని బలిగొంది. ఈ ఘటనలో న్యూజిలాండ్‌కు చెందిన రాబ్ హాల్-ఆండ్రూ హారిస్,  అమెరికాకు చెందిన హాన్సెన్ -స్కాట్ ఫిషర్ ,  జపాన్ యాసుకో నంబా,  భారత్ కు చెందిన సుబేదార్ సెవాంగ్ -లాన్స్ నాయక్ -పల్జోర్ లు మృతి చెందారు.

మరణాలు
ఎడ్మండ్ హిల్లరీ-టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఏడాది 1953 నుంచి.. ఇప్పటిదాకా 250 మందికి పైనే చనిపోయారు. మరో విషయం ఏమిటంటే.. 70 శాతం మంది దేహాలు గల్లంతు అయ్యాయి. లెక్కల ప్రకారం.. 150 మంది పర్వతారోహకుల మృతదేహాలు ఏమయ్యాయో కూడా తెలియదు.

ఆరంభంలో ఆహ్లాదం, కానీ.. 

ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఎదురయ్యే సవాళ్లు చాలా కఠినంగా ఉంటుంది. అదీ దశలవారీగా. ఎవరెస్ట్ అధిరోహణలో.. ముందుగా పర్వత పాదాన్ని చేరాలి. దీన్నే బేస్ క్యాంప్ అంటారు. ఎవరెస్ట్ ఎక్కేముందు క్లైంబర్స్ ఇక్కడే రెండు వారాల పాటు ఉండాలి. ఈ టైంలో ఎవరెస్ట్‌ వాతావరణానికి అలవాటు పడతారు. ఈ రెండు వారాలు టెంటుల్లో కాలక్షేపం చేస్తారు. ఈలోగా అధిరోహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.

నెక్ట్స్‌ లెవల్‌లో..  బేస్ క్యాంప్ నుంచి  క్యాంప్ వన్ చేరాలి. ఆ ఎత్తు 6,065 మీటర్లు. అక్కడి నుంచి క్యాంప్ టూ చేరాలి. దీన్నే ‘అడ్వాన్స్ డ్ బేస్ క్యాంప్’ అంటారు. మరో వెయ్యి మీటర్లు ఎత్తు పైకి వెళ్తే.. క్యాంప్ త్రీ వస్తుంది. ఆ తర్వాత మరో 500 మీటర్లకు క్యాంప్ ఫోర్. ఇది దాటితే కష్టాలు మొదలైనట్లే. క్యాంప్ ఫోర్ తర్వాత వచ్చేది బాల్కనీ. దీని ఎత్తు 8,400 మీటర్ల ఎత్తు. ఇక్కడి నుంచి శిఖరాన్ని చేరాలంటే మధ్యలో ప్రాణాలతో చెలగాటమే. నడుం లోతు మంచు లోంచి పై కెక్కాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కొన్ని వేల మీటర్ల కింద లోయలో పడిపోవడమే. సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు!.

ఎవరెస్ట్ ఎక్కడంలో అసలు సమస్యంతా ఎక్కడంటే.. వాతావరణంతోనే!. ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణంలో వచ్చే మార్పులు.. అధిరోహకులకు నరకం చూపిస్తాయి. ఒక్కసారిగా గాలులు విజృంభిస్తాయి. ఎడతెరపి లేకుండా మంచు కురుస్తూనే ఉంటుంది. పైకి వెళ్లడానికీ ఉండదు. కిందకు దిగడానికీ ఉండదు. ఈ గాలుల వల్ల ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. వీటితో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. 

ఉదాహరణకు.. సెరిబ్రల్ ఎడిమా అనే వ్యాధి సోకితే గనుక పర్వతారోహకులు వింతగా ప్రవర్తిస్తారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ల మెదడు చురుకుగా ఉండదు. అంత ఎత్తులో ఉన్నవాళ్లు.. తాము కిందకు  జంప్ చేయగలమనే భావనలోకి కూరుకుపోతారు. అంతిమంగా అది వాళ్ల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది. 

రిస్క్‌లేని లైఫ్‌ ఎందుకు?
ఇన్ని అవరోధాలు, ఆటంకాలు అధిగమిస్తూ ఆకాశమే హద్దుగా ఉన్న ఎవరెస్ట్‌ను పర్వతారోహకులు అధిరోహించి అక్కడ జెండా పాతేస్తారు. ప్రపంచ విజేతగా తమను తాము ప్రకటించుకుని పొంగిపోతారు. అసలు ఆనందంకోసం ఒక్కోసారి ప్రాణాలు కూడా పణంగా పెట్టేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టి.. ఇదంతా అవసరమా? అనే ప్రశ్నకు.. ఎవరెస్ట్‌ ప్రియుల నుంచి వినిపించే సమాధానం ఒక్కటే. రిస్క్‌ లేకపోతే లైఫ్‌ వ్యర్థం అని.  ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రయాణాలు మానేసి ఇంట్లో కూర్చుని ఉంటామా? అలాగే ఇది కూడా అంటారు. పర్వతారోహణ అణువణువునా జీర్ణించుకుపోయిన ఒక ప్యాషన్‌.. వాళ్లతో అంతేసి సాహసం చేయిస్తోంది మరి!. ఎవరెస్ట్‌ అనే మహోతన్నత శిఖరం.. మనిషి ఓపికకు పరీక్ష పెడుతుంది. కష్టం విలువను తెలియజేస్తుంది. ఆహారాన్ని ఎలా దాచుకోవాలి అనే పొదుపు పాఠం నేర్పుతుంది. అన్నింటికి మించి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఎలా పోరాడాలి.. ముందుకు ఎలా సాగాలి అనే జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది.

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top