మోదీ పుట్టినరోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?

Happy Birthday PM Narendra Modi: Less Known Facts About Chaiwala - Sakshi

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ప్రధానిగా.. గ్లోబల్‌ ఫేమ్‌ దక్కించుకున్నారు నరేంద్ర మోదీ. ఆయన తీసుకునే నిర్ణయాలను.. ప్రతీ చర్యనూ అంతే ఆసక్తిగా గమనిస్తుంటుంది మన దేశం. ఇవాళ ఆయన 72వ పుట్టినరోజు. ఈ సందర్భంగా నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ జీవితంపై ప్రత్యేక కథనం.. 

భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడేళ్లకు.. గణతంత్రంగా మారిన కొన్నినెలలకు నరేంద్ర మోదీ జన్మించారు. 

 ఉత్తర గుజరాత్‌ మెహ్‌సనా జిల్లా వాద్‌నగర్‌లో సెప్టెంబర్‌ 17, 1950.. దామోదర్‌ దాస్‌ మోదీ, హిరాబా మోదీ దంపతులకు జన్మించారు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ.  ఆరుగురు సంతానంలో నరేంద్రుడు మూడవవాడు. 

 తనది అట్టడుగు స్థాయి కుటుంబంగా చెప్పుకునే ఆయన.. తన చిన్నతనంలో తిండి కోసం పడ్డ కష్టాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. తన తల్లి ఇల్లు గడవడానికి నాలుగు ఇళ్లలో పని చేసేదని, తన తండ్రి స్థానికంగా ఉన్న స్టేషన్‌లో ఛాయ్‌ అమ్ముకుని జీవించేవారని, తానూ తన తండ్రికి సహాయంగా పనికి వెళ్లేవాడినని ఆయన తరచూ చెప్తుంటారు. 

ఆర్మీలో చేరాలనుకున్నా.. 

ఆర్మీలో చేరాలని నరేంద్ర మోదీ కలలుగన్నాడు. జామ్‌నగర్‌ సైనిక్‌ స్కూల్‌లో చేరాలని ప్రయత్నించాడు కూడా. కానీ, ఆర్థిక సమస్యలతో ఆ కల.. కలగానే మిగిలిపోయింది. అయితే.. 1965 ఇండో-పాక్‌ వార్‌ సమయంలో స్టేషన్‌కు చేరుకునే భారత సైనికులకు టీ అందించడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నట్లు చెప్పేవారు. 

పనిమంతుడు
మంత్రులు, తోటి నాయకులు, చివరికి  నరేంద్ర మోదీ వ్యక్తిగత సిబ్బంది  కూడా ఆయన గురించి చెప్పే ఒకే ఒక్కమాట.. విరామమెరుగని పనిమంతుడు అని. ఆ పని వల్లే తనకు నిద్ర దూరమైందని, కాకపోతే యోగా, ప్రాణాయామం వల్ల తాను ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండగలుగుతున్నానని మోదీ తరచూ చెప్తుంటారు. 

అది అసలు నచ్చదు
హోటల్స్‌ బస చేయడం అంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు.. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయనెప్పుడూ హోటల్స్‌లో దిగడానికి ఆసక్తికనబరిచేవారు కాదు. దాదాపుగా..  ప్రయాణాలతో ఆ సమయాన్ని భర్తీ చేసుకునేవారు ఆయన. ఒకవేళ ఆ మరుసటిరోజు ఉదయం మీటింగ్‌లు ఉండే అత్యవసర స్థితిలో మాత్రమే ఆయన హోటల్స్‌లో దిగేవారట.  

 ఉన్నత పదవుల్లో, స్థానాల్లో ఉన్నవాళ్లు తరచూ విరామం తీసుకోవడం చూస్తుంటాం. కానీ, నరేంద్ర మోదీ మాత్రం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా.. పదమూడేళ్లలో ఏనాడూ సెలవు పెట్టింది లేదు. అసలు ఆయన అంతకాలంలో జ్వరం బారిన పడిన దాఖలాలు, విరామం తీసుకున్నారనేది కూడా లేకపోవడం విశేషం. ఇప్పుడు ప్రధానిగానూ దేశం కోసం ఆయన అదే డెడికేషన్‌ను ప్రదర్శిస్తున్నారు. 

► ప్రధాని మోదీకి ఒంటరి జీవితం అంటేనే ఇష్టం. యువకుడిగా ఉన్నప్పుడు దేశంలో చాలాచోట్లు, ఆధ్యాత్మిక యాత్రలు చేశారు. చిన్నతనంలో పెద్దలు బలవంతంగా చేసిన పెళ్లిని ఆయన తిరస్కరించారు. 

అమెరికాలో మూడు నెలలపాటు.. 
ఆధ్యాత్మిక, మతపరమైన ధోరణిలో మునిగిపోయి.. మోదీ తన కాలేజీ జీవితాన్ని కూడా పక్కనపెట్టేశారు. సంచారిగా కోల్‌కతాలోని బేలూర్‌ మఠానికి తన ప్రయాణానికి కొనసాగించారు. అయితే.. తన 28వ ఏట ఆయన ఢిల్లీ యూనివర్సిటీ తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారాయన. ఇక ఇమేజ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ కోర్సు కోసం మూడు నెలలపాటు అమెరికాలో ఉన్నారు. 

 వర్క్‌హాలిక్‌ అయిన మోదీకి మందు, సిగరెట్‌ లాంటి అలవాట్లు లేవు. నిత్యం యోగా చేసే అలవాటు ఉన్న ఆయన.. పక్కా వెజిటేరియన్‌ డైట్‌ను ఫాలో అవుతుంటారు. ఫొటోగ్రఫీ, కవితలు-పద్యాలు రాయడం ఆయనకు ఇష్టం. ఆయన ఫొటోలతో చాలాసార్లు ఎగ్జిబిషన్‌ కూడా నిర్వహించారు.

పాలనాపరమైన నిర్ణయాల్లోనూ ప్రధానిగా తనదైన ముద్ర చూపిస్తున్నారు ఇప్పుడు. అందుకే గ్లోబల్‌ లీడర్‌లలో అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న నేతగా గుర్తింపు దక్కించుకున్నారు.

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top