పేర్చలేమమ్మా..
శంషాబాద్ మండలంలో గత ఏడాది సుమారు 800 ఎకరాల్లో బంతి, చేమంతి, గులాబీ తోటలు సాగయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 500 ఎకరాలకు మించలేదు. మొయినాబాద్ మండలంలో 600 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 476 ఎకరాల్లోపే సాగైంది. ఇక ఏటా వెయ్యి ఎకరాలకుపైగా సాగు అయ్యే చేవెళ్లలో 653 ఎకరాలు, షాబాద్‌లో 218 ఎకరాలు, శంకర్‌పల్లిలో 208 ఎకరాల్లో మాత్రమే పూలతోటలు సాగయ్యాయి.
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్‌నగర్/మొయినాబాద్‌రూరల్: జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 5943 ఎకరాల్లో పూల తోటలు సాగవ్వగా.. ప్రస్తుతం 4,178 ఎకరాలకు మించలేదు. 38,836 మెట్రిక్ టన్నుల పూల దిగుబడి వస్తున్నట్లు ఉద్యానవనశాఖ అంచనా వేసింది. కానీ ఎల్‌నినో కారణంగా నాటిన మొక్కలు ఇప్పటికీ నేలచూపులే చూస్తున్నాయి. మెజార్టీ తోటలు వాడిపోగా, పచ్చగా ఉన్నవాటిలోనూ ఆశించిన స్థాయి దిగుబడి రాలేదు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పూల ధరలకు రెక్కలొచ్చాయి. బంతి కిలో రూ.150 పలుకుతుండగా, గులాబీ రూ.300, చామంతి రూ.400 వరకు విక్రయిస్తున్నారు.
వర్షాలు లేకపోవడంతో..
నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో పూల ధరలు ఆకాశాన్నంటడంతో మహిళలు కొనుగోలుకు వెనుకాడుతున్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద బతుకమ్మలను పేర్చి ఆడిన వాళ్లు.. ప్రస్తుతం పావుకేజీ పూలతో చిన్న బతుకమ్మను చేసి ఆడాల్సిన దుస్థితి తలెత్తింది. వర్షాలు లేకపోవడంతో తంగేడు, గడ్డిపూలకు కొరత ఏర్పడింది. మార్కెట్‌కు వచ్చిన కొద్దిపాటి పూల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
పడిపోయిన దిగుబడులు
జిల్లాలోని షాద్‌నగర్, కొందుర్గు, కొత్తూరు, కేశంపేట, జిల్లేడు చౌదరిగూడ, చేవెళ్ల, ఆలూరు, మొయినాబాద్, షాబాద్ తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున పూల తోటలు సాగు చేసేవారు. బతుకమ్మలకు ఉపయోగించే బంతి, చామంతి, గులాబీ తదితర పూలను ఎక్కువగా సాగు చేసేవారు. బతుకమ్మ సంబురాలు జరిగే తొమ్మిదిరోజుల పాటు పూలకు విపరీతంగా గిరాకీ ఉండేది. దిగుబడులు ఎక్కువగా ఉండడంతో ధరలు అందుబాటులో ఉండేవి. మహిళలు పోటాపోటీగా పూలను తెచ్చి బతుకమ్మలను అందంగా పేర్చి సంబురాలు జరుపుకొనేవారు. కానీ ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈసారి వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో చాలాచోట్ల పూల సాగు చేసినప్పటికీ ఎండిపోయి దిగుబడులు అమాంతంగా పడిపోయాయి. దీంతో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు రైతులకు లాభాలు లేకుండా పోయాయి.
రియల్ ఎఫెక్ట్
గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమంగా విస్తరిస్తోంది. వ్యాపారులు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా వెంచర్లు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రకృతిలో లభించే తంగేడు, గుమ్మడి, గునుగు పువ్వు, కట్ట, చేమంతి, బంతి, రుద్రాక్ష, గోరింట, కలువ, నందివర్ధనం, గడ్డి పూలు, గన్నేరు, కమలం తదితర పూలు కూడా కనిపించకుండా పోతున్నాయి.
పూలసాగుపై ఎల్‌నినో ఎఫెక్ట్
జిల్లాలో భారీగా తగ్గిన తోటలు
గణనీయంగా పడిపోయిన దిగుబడి
బంతి, చేమంతి, గులాబీ ధరలకు రెక్కలు
తంగేడు, గడ్డిపూలకు భారీ డిమాండ్
పండుగ వేళ మహిళల ఆందోళన


