ప్రయాణ పాట్లు .. తప్పని ఫీట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణ పాట్లు .. తప్పని ఫీట్లు

Oct 10 2026 8:02 AM | Updated on Oct 10 2026 8:02 AM

చేవెళ్ల: విద్యాసంస్థలకు దసరా పండగ సెలవుల నేపథ్యంలో శుక్రవారం చేవెళ్ల బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా కనిపించింది. హైదరాబాద్‌ నుంచి చేవెళ్ల మీదుగా తాండూరు, పరిగి, కొండగల్‌, మద్దూర్‌, వికారాబాద్‌ ప్రాంతాలకు వెళ్లే బస్సులు సరిపోక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు. బస్సులన్నీ కిక్కిరిసి రావడంతో ఒక్కో బస్సుల్లో వందమందికిపైగానే ప్రయాణించాల్సిన పరిస్థితి కనిపించింది. చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న గురుకుల పాఠశాలల హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులతో చేవెళ్ల పట్టణం రద్దీగా కనిపించింది. బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో ఎక్కడ చూసినా సొంతూళ్లకు వెళ్తున్న విద్యార్థులతో సందడి నెలకొంది. చేవెళ్ల బస్‌స్టేషన్‌లో మద్దూర్‌కు వెళ్లే బస్సు సిటీ నుంచి వందమందికి పైగా ప్రయాణికులతో చేవెళ్ల బస్‌స్టేషన్‌కు వచ్చింది. మరింత మంది ఎక్కేందుకు రావటంతో డ్రైవర్‌ బస్సును నిలిపివేశాడు. ఫుట్‌బోర్డు, బస్సు టాప్‌పై ఉన్న ప్రయాణికులు దిగితేనే బస్సు కదుతుందని చెప్పారు. ప్రయాణికులు వినకపోవటంతో పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పి బస్సును పంపించారు. సెలవులు ఇస్తున్నట్లు తెలిసినా అదనపు బస్సులు ఎందుకు ఏర్పాటు చేయలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి అయినా బస్‌స్టేషన్‌లో ప్రయాణికులు, విద్యార్థులకు బస్సులకోసం నిరీక్షణ తప్పలేదు.

విద్యా సంస్థలకు దసరా సెలవులు

ఊరిబాట పట్టిన విద్యార్థులు

బస్టాండ్లలో కిక్కిరిసిన ప్రయాణికులు

బస్సులకోసం గంటల తరబడి నిరీక్షణ

ప్రైవేటు వాహనాలే దిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement