● చంద్రదన సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా
● పురుగుమందు డబ్బాలతో నిరసన
ఆమనగల్లు: ‘విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి.. ఆత్మహత్యలే శరణ్యం’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల మూలంగా పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ తలకొండపల్లి మండలం చంద్రదన గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఆత్మహత్యలు చేసుకుంటామంటూ పురుగుమందుల డబ్బాలు పట్టుకుని నిరసన వ్యక్తంచేశారు. తలకొండపల్లి మండలం చంద్రధన సబ్‌స్టేషన్ నుంచి చంద్రదన, రాంపూర్, సంఘాయిపల్లి, నల్లరాల్లతండా, పూల్‌సింగ్‌తండాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. కొన్ని రోజులుగా చంద్రదన సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా సరిగా లేదని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ చంద్రధన సబ్‌స్టేషన్ ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేశారు. విద్యుత్ సరఫరా చేసి తమ పంటలు కాపాడాలని కోరారు. పురుగుమందు డబ్బాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్రమంలో రైతులు శ్రీకాంత్‌రెడ్డి, రాజిరెడ్డి, గణేశ్‌యాదవ్, రాజుయాదవ్, కుమార్, శేఖర్, సాజిద్ పాల్గొన్నారు.


