నాణ్యతకు తిలోదకాలు! | - | Sakshi
Sakshi News home page

నాణ్యతకు తిలోదకాలు!

Oct 10 2026 8:02 AM | Updated on Oct 10 2026 8:02 AM

ఇసుక స్థానంలో డస్ట్‌ వినియోగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు

వికారాబాద్‌: కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పనుల నిమిత్తం ఇసుక అనుమతులు తీసుకుని ప్రైవేటుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పని ప్రదేశంలో భారీగా డంప్‌ చేసి రాత్రి వేళ గుట్టుగా తరలిస్తున్నారు. ఇసుక స్థానంలో డస్ట్‌ వాడుతూ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ఈ విషయం అధికారులు, ప్రజా ప్రతినిధులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నాణ్యత లేని పనులపై ఆయకట్ట రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోక.. సాగు నీరందక ఇబ్బందులు ప డుతూ వచ్చామని, ప్రస్తుతం జరుగుతున్న పనులు సరిగ్గా లేవని ఆరోపిస్తున్నా రు. డస్ట్‌ వినియోగంపై ఎవరైనా ప్రశ్నిస్తే తాము రెండు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు, అధికారులకు పర్సెంటేజీలు ఇవ్వాలని బాహాటంగానే చెబుతున్నారని తెలిపారు.

రూ.3 కోట్ల నుంచి రూ.100 కోట్లకు..

రెండేళ్ల క్రితం ప్రాజెక్టు అభివృద్ధి, మరమ్మతుల కోసం ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. మొదట పనులు చకచకా జరగ్గా ఇప్పుడు మందకొడిగా సాగుతున్నాయి. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.57 టీఎంసీలు.. కుడి, ఎడమ, బేబి కెనాల్‌ ద్వారా 15వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. 15 సంవత్సరాల క్రితం రూ.3 కోట్లతో ప్రారంభమైన ప్రతిపాదనలు ప్రస్తుతం రూ.100 కోట్లకు చేరాయి. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో 15 సార్లు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్ర స్థాయి అధికారులు ప్రాజెక్టును సందర్శించి వెళ్లారు. రెండేళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. అయితే సాంకేతికపరమైన అనుమతులు, టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు ఏడాదిన్నర పట్టింది. ప్రస్తుతం కాలువల పనులు సాగుతున్నాయి. ఇప్పటికై న జాప్యం లేకుండా పనులు చేపట్టి వర్షాకాలం వచ్చేలోగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయకట్టు గ్రామాల రైతులు కోరుతున్నారు.

పనుల్లో తీవ్ర జాప్యం

రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత.. ఎట్టకేల కు రెండేళ్ల క్రితం కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు మోక్షం లభించింది. ప్రభుత్వం రూ. 89.3 కోట్లు విడుదల చేసింది. అయితే టెండర్లు, పనుల ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. పనుల కాలయాపనపై ఆరోపణలు, విమర్శలు రావడంతో ఎట్టకేలకు ప్రారంభించారు. జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన కోట్‌పల్లి మరమ్మతులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ప్రభు త్వం ఏదైనా ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. నిధుల విడుదల మాటే లేకుండా పోయింది. వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాలకు చెందిన 18 గ్రామాల పరిధిలోని వేల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజె క్టు అభివృద్ధి విషయంలో చిన్నచూపు చూశారు. కాలువలు పూడిపోయి.. ఆన కట్ట, ఆలుగు దెబ్బతిని.. తూము లు చెడిపోయి ప్రస్తుతం రెండు గ్రామాలకే సాగునీరందించే దీనావస్థకు చేరింది. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పనులకు మోక్షం లభించింది.

ఇష్టారాజ్యంగా కోట్‌పల్లి ప్రాజెక్టు పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement