విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు మెరుగుపడ్డాయి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘వరుస తనిఖీలతో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాల్లో విద్యుత్ ప్రమా దాలు తగ్గాయి. అధికారుల నిషిత పరిశీలనతో కొత్తగా ఏర్పాటు చేసే సంస్థల్లో విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు మెరుగుపడ్డాయి’ అని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ ఆఫ్ తెలంగాణ కె.నందకుమార్ స్పష్టం చేశారు. సీ ఈఐజీగా బాధ్యతలు స్వీకరించి, ఆగస్టుతో ఏడా ది కాలం పూర్తి కాబోతోంది. ఆయన పనితీరుకు గుర్తింపుగా ప్రభుత్వం పదవీకాలన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పలుకరించింది. ఆయన మాటల్లోనే..
ఖర్చుతో పోలిస్తే.. ఆదాయం అధికం
గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు, కొత్త కనెక్షన్లకు అనుమతుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ఒక్క హెటీ కనెక్షన్ల ద్వారానే రూ.16 కోట్లు, సినిమాహాల్స్ ద్వారా రూ.7 కోట్ల రాబడి వచ్చింది. ఇక పీరియాడికల్ ఇన్‌స్పెక్షన్ల ద్వారా మరో రూ.3 కోట్లు వచ్చాయి. సీఈఐజీ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.9 కోట్లు ఖర్చవుతోంది. ఈ విభాగానికి చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే అధికం.
పారదర్శకతను పెంచాం
సీఈఐజీ విభాగంలో పారదర్శకతకు పెద్దపీట వేశాం. 89 మంది ఉద్యోగులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు అంతా కలిసి రోజూవారీ యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నాం. ఎవరు ఏ కంపెనీలో తనిఖీలకు వెళ్లారు.. గుర్తించిన లోపాలు వంటి అంశాలను రిజిస్టర్‌లో రికార్డు చేయిస్తున్నాం. వారంలో నాలుగు రోజుల్లో జిల్లాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. తోటి ఉద్యోగుల పనితీరులోనూ మార్పు తీసుకొచ్చాం. అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. మధ్యవర్తుల ప్రమోయం లేకుండా నిర్దేశిత గడువులోగా ఫైళ్లు క్లియర్ చేయిస్తున్నాం. దరఖాస్తు సహా విద్యుత్ లైన్లలో ఏదైనా షార్ట్‌ఫాల్ ఉంటే.. ముందే గమనించి, వాటిని సరి చేయిస్తున్నాం. వినియోగదారుల కోసం ఫోన్ నంబర్ 040–23450367 పునరుద్ధరించాం.
ప్రమాదాలు నివారిస్తున్నాం
హెచ్‌టీ కనెక్షన్ల కోసం అనుమతులు కోరుతూ ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న లోడుకు తగ్గ ప్రమాణాల మేరకు లైన్లు, కేబుళ్లు, ఏబీ స్విచ్ బోర్డులు, ఎర్తింగ్ సిస్టం, ప్యానల్ బోర్డులు, ఫ్యూజ్ బాక్సులు, డీటీఆర్, బ్రేకర్, కండక్టర్ ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే అనుమతులు జారీ చేస్తున్నాం. క్షేత్రస్థాయి తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిచేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. మార్పులు, చేర్పులు చేసిన తర్వాతే అనుమతులు జారీ చేస్తున్నాం. ఆయా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో విద్యుత్ ప్రమాణాలను పెంచి, ప్రమాదాలను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం.
వినియోగదారులకు సూచనలు
● ఇళ్లలో విధిగా ఎంసీబీ, ఎసీసీబీ, ఆర్‌సీసీబీలు వాడటం ద్వారా ఏదైనా ఫాల్ట్ వస్తే వెంటనే ట్రిప్పై సరఫరా నిలిచిపోతుంది. ప్రమాదాన్ని నివారిస్తుంది.
● విద్యుత్ పరికరాలను ఎర్తింగ్ చేయడం ద్వారా షాక్ తగలకుండా నియంత్రిస్తుంది.
● ప్రస్తుతం వంటకు ఎలక్ట్రిక్ స్టవ్‌ల వాడకం పెరిగింది. స్విచ్‌లు, సాకేట్‌లను ఆ మేరకు మార్చుకోవాలి.
● అపార్ట్‌మెంట్స్‌లోని ప్యానల్, పంపు గదుల్లో స్నోక్‌డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు విధిగా వాడాలి. ఇండస్ట్రీస్‌లో కెపాసిటర్‌లను తప్పనిసరి వినియోగించాలి. ఆటోమేటిక్ కేపాసిటర్ మరింత సురక్షితం.
● ట్రాన్స్‌ఫార్మర్లు, బ్రేకర్లు ఉన్న ప్రదేశాల్లో అగ్నిమాపక యంత్రాలు ఉండాలి.
● ఏసీలు, గ్రీజర్లు, ఇతర పరికరాలు వాడుకలో లేనప్పుడు స్విచ్ఛాఫ్ చేయాలి.
● బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల వద్ద ప్రాపర్ ఎర్తింగ్ చేయాలి. లిథియం బ్యాటరీలు చాలా ప్రమాదకరం. ఫైర్‌సేఫ్టీ తప్పనిసరి.
● స్నానాల గదిలో స్విచ్, సాకెట్స్ అమర్చొద్దు. విద్యుత్ పరికరాల వద్ద మండే స్వభావం గల వస్తువులు ఉంచొద్దు. కప్‌బోర్డుల్లో లైటింగ్ ప్రమాదకరం.
పారదర్శకతకు పెద్దపీట
ఉద్యోగులతో వాట్సాప్ గ్రూప్
నిర్దేశిత గడువులోపు ఫైళ్లు క్లియర్
కొత్త కనెక్షన్లతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం
‘సాక్షి’తో సీఈఐజీ నందకుమార్


