మట్టిపోసి.. మూసేసి! | - | Sakshi
Sakshi News home page

మట్టిపోసి.. మూసేసి!

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు

ఓవైపు చెరువులు, కుంటలను కాపాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిని పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయి. శిఖం భూముల్లో మట్టి పోసి చెరువులను మూసివేస్తూ.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. – మొయినాబాద్‌

హైదరాబాద్‌ మహానగరానికి అతి చేరువలో ఉన్న మొయినాబాద్‌ మండలంలో రియల్‌ వ్యాపారులు పాగా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో 111 జీవో అమల్లో ఉండటంతో పక్కనే ఉన్న గండిపేట మండలంతో పోలిస్తే భూముల ధరలు సుమారు 10 రెట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో రియల్‌ వ్యాపారులు ఇక్కడ తక్కువ ధరలో భూములు కొనుగోలు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల సమీపంలో భూములు కొని వాటిని కబ్జా చేస్తున్నారు. మొయినాబాద్‌ మున్సిపాలిటీతోపాటు మండలంలో సుమారు 48 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెవులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు, పూడ్చివేతలు కొనసాగాయి. కాపాడాల్సిన ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా స్థానికులు ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.

శిఖంలో మట్టితో పూడుస్తున్న వైనం

ఆనవాళ్లు లేకుండా చేస్తున్న అక్రమార్కులు

నోటీసులతో సరిపెడుతున్న అధికారులు

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

అమ్డాపూర్‌ పటేల్‌కుంటలో మట్టి పోస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపించి పరిశీలించాం. శిఖంలో మట్టిపోస్తే చర్యలు తీసుకుంటాం. మండలంలోని చెరువులు, కుంటలను పరిశీలించి ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో గుర్తిస్తాం. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటాం.

– గౌతమ్‌కుమార్‌, తహసీల్దార్‌, మొయినాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement