రూ.2 వేల కోట్ల భూమి సర్కార్‌దే.. | - | Sakshi
Sakshi News home page

రూ.2 వేల కోట్ల భూమి సర్కార్‌దే..

Jun 10 2026 7:32 AM | Updated on Jun 10 2026 7:32 AM

సాక్షి, హైదరాబాద్‌: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 41/12, 41/13, 41/14లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 15 ఎకరాలు సర్కార్‌వేనని హైకోర్టు తేల్చిచెప్పింది. హక్కులు కోరుతూ ఐటినా ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్ల చూపిన పట్టా సర్టిఫికెట్లు నకిలీవని, కల్పిత పత్రాల ఆధారంగా ప్రభుత్వ భూములను కాజేసే కుట్ర జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు ఆధారంగా చూపిన 1972, 1973 సంవత్సరాల పట్టా సర్టిఫికెట్లపై రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయ ముద్ర ఉందని..ఆ కార్యాలయం 1978లో మాత్రమే ఏర్పడిందని పేర్కొంది. పిటిషనర్ల హక్కులన్నీ ఈ పట్టాలపైనే ఆధారపడ్డాయని.. అనుమానాస్పదంగా ఉన్న వాటిని నిజమైనవని నిరూపించే బాధ్యత పూర్తిగా వారిపైనే ఉందని వ్యాఖ్యానించింది. కానీ వారు అది నిర్వర్తించలేకపోయినందున నకిలీ పట్టాల ఆధారంగా జరిగిన తదుపరి లావాదేవీలు, రెవెన్యూ ఎంట్రీలు, విక్రయాలు కూడా చట్టబద్ధ హక్కులను సృష్టించలేవని స్పష్టం చేసింది. అక్రమాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీఐడీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణ ముగించింది.

కార్యాలయ ముద్ర అనుమానాస్పదం

ఖానామెట్‌లోని 15 ఎకరాల భూమి తమదేనని, అధికారులు దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ హైకోర్టులో ఐటినా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ సైనికులకు కేటాయించిన భూమిని వారి వారసుల నుంచి 2006లో పిటిషనర్‌ కొనుగోలు చేసింది. పట్టా భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి ఈ వాదనలను తప్పుబట్టారు. పిటిషనర్లు ఆధారంగా చూపిన 1972, 1973 సంవత్సరాల పట్టా సర్టిఫికెట్లపై ‘తహసీల్దార్‌, రాజేంద్రనగర్‌’ కార్యాలయ ముద్ర ఉందని, కానీ ఆ కార్యాలయం 1978లోనే ఏర్పడిందన్నారు. ఆ సర్టిఫికెట్లు అసలైనవిగా ఉండే అవకాశం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని తేల్చేశారు. తహసీల్దార్‌ జారీ చేయాల్సిన ఆదేశాలను ‘రికార్డింగ్‌ ఆఫీసర్‌’ పేరిట జారీ చేసినట్లు చూపడం అనుమానాస్పదమని, ఆ పత్రాలు కూడా కల్పితమైనవేనని అభిప్రాయపడ్డారు. నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా జరిగిన లావాదేవీలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. పిటిషన్‌ను కొట్టివేస్తూ, పిటిషనర్‌కు రూ.5 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించారు.

ఖానామెట్‌ భూములపై ఐటినా ప్రాపర్టీస్‌ పిటిషన్‌ కొట్టివేత

అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సీఐడీ దర్యాప్తునకు ఆదేశం

Advertisement
 
Advertisement
Advertisement