చేవెళ్ల: వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న చేవెళ్ల వాసులను జాతీయ సేవారత్న అవార్డులు వరించాయి. బహుజన సాహిత్య అకాడమీ 18వ ఆల్‌ఇండియా రైటర్స్ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను చేవెళ్ల మండలం కమ్మెట మాజీ సర్పంచులు పట్లోళ్ల హన్మంత్‌రెడ్డి, తులసీరాజు, మున్సిపాలిటీ పరిధిలోని పామెన 8వ వార్డుకు చెందిన కృష్ణమోహన్ ముదిరాజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అవార్డులకు ఎంపిక చేసినందుకు బహుజన జాతీయ సాహిత్య అకాడమీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని ఇండోర్ స్టేడియం (మినీస్టేడియం)లో మంగళవారం ఉదయం 9 గంటలకు స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు మండల స్థాయిలో విద్యార్థుల ఎంపిక జరుగుతుందని ఎంఈఓ మనోహర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ఆధార్‌కార్డుతో జతచేసి ఎంపిక ప్రక్రియలో రిపోర్ట్ చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియ డివిజన్ గేమ్స్ జోనల్ సెక్రటరీ బాలయ్య ఆధ్వర్యంలో కొనసాగుతుందని చెప్పారు. మండల పరిధిలోని పీఈటీలు, పీడీలు తప్పనిసరిగా ఇండోర్ స్టేడియంలో రిపోర్ట్ చేయాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


