మాడ్గుల: మండల పరిధి అప్పారెడ్డిపల్లి సర్వే నంబర్ 168లో 50 ఏళ్ల క్రితం నిర్మించిన చెరువు భూములతో పాటు అలుగు నేలలను అక్రమార్కులు చెరబట్టారని గ్రామస్తులు ఆరోపించారు. ఆదివారం చెరువు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. చెరువు నిర్మాణ సమయంలో రైతులకు నష్టపరిహారం చెల్లించి, చెరువు నిర్మాణం చేపట్టినట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆ సమయంలో ఎస్సీ,ఎస్టీల భూములను అందులోంచి తొలగించి, అగ్రవర్ణాల భూములను తొలగించలేదని పేర్కొన్నారు. దీంతో ధరణిలో పాస్‌బుక్కులు రావడంతో.. ఇదే అదనుగా భావించిన కొందరు.. అధికారుల సహాయంతో క్రయవిక్రయాలు చేస్తున్నారని విమర్శించారు. చెరువు అలుగును వదలకుండా సుమారు నాలుగు ఎకరాల పొలాన్ని ఆక్రమించి, కడీలు పాతి బోరు కూడా వేశారని పేర్కొన్నారు. ఇదే విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. చెరువు విధ్వంసానికి గురవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని, చెరువు, అలుగు భూములను కాపాడాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో తెలంగాణ బ్లాక్ వాయిస్ అధ్యక్షుడు శ్రీధర్ గోవిందు, తోట చంద్రయ్య, పాపయ్య, మల్లయ్య, యాదయ్య, శీశైలం, జంగయ్య తదితరలు పాల్గొన్నారు.


