రోజుకో మలుపు
21వ వార్డు కౌన్సిలర్‌పై ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్, మాజీ సర్పంచ్ చిలుకల బుగ్గరాములుపై ప్రత్యర్థులు గురువారం కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. రెండు చోట్ల ఓట్లు ఉండి సర్పంచ్ ఎన్నికల్లో తులేకలాన్ గ్రామంలో ఓటు వేసిన బుగ్గరాములు ఇబ్రహీంపట్నం 21వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఎలా పోటీ చేస్తారని జనసేన అభ్యర్థి ప్రశ్నించారు. ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బుగ్గరాములుపై కాంగ్రెస్‌కు చెందిన ప్రత్యర్థి ఈగల రాములు హైకోర్టును ఆశ్రయించారు. మూడు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో, వేర్వేరు కార్డు నంబర్లతో ఓటర్‌గా బుగ్గరాములు నమోదు చేసుకున్నాడని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో తులేకలాన్‌లో ఓటు హక్కు వినియోగించుకొని మళ్లీ కౌన్సిలర్‌గా పోటీ చేయడాన్ని ఆక్షేపించారు. ఎన్నికల అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. కాగా 17న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది కావున కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని, చైర్మన్‌గా తనను ప్రకటించి, వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించాలని టేకుల సుదర్శన్‌రెడ్డి గురువారం కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది.
ఇబ్రహీంపట్నం: పురపాలిక చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు సీరియల్ డ్రామాను తలపిస్తోంది. ఆయా పదవుల ఎన్నికలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పలేని అయోమయ, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుపార్టీల శ్రేణులు వివిధ అంశాలపై న్యాయస్థానం గడప తొక్కడంతో పీఠముడి ఎప్పటికి వీడుతుందోనన్న సందిగ్ధం నెలకొంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతోపాటు పలువురు కౌన్సిలర్లపై చెలరేగుతున్న దుమారంతో రాజకీయాలు ఆసక్తిగా మారి రసకందాయంలో పడ్డాయి.
వివాదాస్పదంగా ఎన్నిక
మున్సిపల్ పరిధిలో 24 వార్డులుండగా కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 13, బీజేపీ 2, ఇండిపెండెంట్‌గా ఒకరు విజయం సాధించారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్‌తోపాటు ఒక బీజేపీ కౌన్సిలర్ బీఆర్‌ఎస్‌కు, మరో బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఈ దశలో చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు ఇరుపార్టీలు తమ మద్దతు కౌన్సిలర్లతో క్యాంపులకు వెళ్లాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తిగా వివాదాస్పదంగా మార్చివేశారు. గత సోమవారం మొదటిసారి నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి హాజరుకాలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు, కాంగ్రెస్ కౌన్సిలర్లు చేసిన ఆందోళనలతో ఎన్నిక మరుసటి రోజు మంగళవారానికి వాయిదా పడింది. యాదగిరి అపహరణపై అతని కుమారుడు హరికాంత్ న్యాయస్థానానికి వెళ్లడం.. ఎన్నికలపై స్టే విధించడంతో మరుసటిరోజు అర్ధాంతరంగా సమావేశం ముగిసింది. అప్పటికే చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డికి మద్దతునిస్తూ మెజార్టీ కౌన్సిలర్లు చేతులెత్తగా కోర్టు స్టే తెరపైకి రావడంతో అధికారిక ప్రకటన వెలువడలేదు.
కౌన్సిలర్లపై ఫిర్యాదుల పర్వం
మరోవైపు 23వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ నీలం శ్వేత తప్పుడు కుల ధ్రువపత్రంతో బీసీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీచేసిందని.. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని కలెక్టర్‌కు ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ బుధవారం ఫిర్యాదు చేశారు. 21వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ బుగ్గరాములుకు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్‌గా నమోదై ఉన్నాడని.. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌కు చెందిన ఈగల రాములు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఎన్నిక చేపట్టాలని..
తన పేరును చైర్మన్‌గా ప్రకటించేందుకు, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టేందుకు కౌన్సిల్‌ను సమావేశపరచేలా ఆదేశాలివ్వాలని గురువారం బీఆర్‌ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శన్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ నాటకీయ పరిణామాలకు దారితీసాయి. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తారా.. చిక్కుముడి వీడుతుందా.. ఆధిపత్యపోరులో చివరకు గెలిచేదెవరు.. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు ఎవరిని వరిస్తాయో వేచి చూడాల్సిందే.
రసకందాయంలో ‘పట్నం’ రాజకీయం సీరియల్ డ్రామాను తలపిస్తోన్న ఆధిపత్య పోరు
న్యాయస్థానం గడపలో తగాదాలు
పరస్పర ఫిర్యాదుల పర్వం
ఎన్నిక ప్రక్రియ ఎప్పటికి పూర్తయ్యేనో..?


