మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
ఆమనగల్లు: మున్సిపాలిటీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. బుధవారం ఆయన పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏసీపీ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ శంకర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్‌లకు ఆయన పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఏసీపీ జానకిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు. రౌడీషీటర్లు, అనుమానితులను బైండోవర్ చేస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి అన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు ఎస్‌ఐ వెంకటేశ్, సిబ్బంది ఉన్నారు.
మహేశ్వరం ఏసీపీ జానకీరెడ్డి


