ప్చ్.. లాభం లేదు
కీలక ప్రాజెక్టులకు మొండిచేయి
● మెట్రోరైల్ విస్తరణ ఊసెత్తని వైనం
● నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కేంద్ర ప్రభుత్వం ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ జిల్లావాసులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా భావిస్తున్న భారత్ ఫ్యూచర్‌సిటీ ప్రస్తావన లేదు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, అటు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా జిల్లాలో కీలకమైన ఈ ప్రాజెక్టుకు కూడా పైసా కేటాయించలేదు. మూసీ ప్రక్షాళనకు నిధుల కేటాయింపు లేదు. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్, రావిర్యాల నుంచి ఆమనగల్లు వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ సహా రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులకు పైసా విదల్చలేదు. ఇదిలా ఉంటే దేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు 2047 వరకు టాక్స్ హాలీడే ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో జిల్లాకు మరికొన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక బాలికల హాస్టల్‌ను మంజూరు చేయడం, విద్యుత్ వాహనాలకు రాయితీలు ప్రకటించడం వాహన కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశం. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ మాత్రం జనరంజక బడ్జెట్‌గా అభివర్ణించింది.


