
బారికేడ్లను తొలగించి.. ప్రవాహంలో పయనించి
అపాయంలోపడుతున్న వాహనదారులు
ఆ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి వస్తున్న వరద.. రహదారిని ముంచెత్తి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గం పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయింది.రోడ్డు ధ్వంసం అయింది. అయినావాహనదారులు ప్రవాహంలో పయనిస్తూ ప్రమాదంలో చిక్కుకొంటున్నారు.
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్– తొర్రూర్ రోడ్డు అధ్వానంగా మారింది. డబుల్ బెడ్ రూమ్‌ల వద్ద భారీగా గోతులు ఏర్పడ్డాయి. ప్రమాదకరంగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. అయినా వాహనదారులు ప్రమాదకరమైన దారిలో పయనిస్తూ.. అపయాన్ని కొని తెచ్చుకొంటున్నారు. అయినప్పటికీ.. మున్సిపల్ అధికారులు, పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
బారికేడ్లతో సరి..
మాసబ్ చెరువు నుంచి ఇంజాపూర్‌లోని దిలావర్‌ఖాన్ చెరువుకు నీరు వచ్చే వాగుపై కేవలం 10 రోజుల వ్యవధిలో 20కి పైగా కార్లు రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో పడిపోవడంతో పాటు.. కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్క సోమవారం నాడే.. ఒక కారు వాగులో పడిపోగా, మరో కారు గుంతలో కుంగిపోయింది. క్రేన్ల సహాయంతో వాటిని బయటకు తీశారు. ఇక్కడ రోడ్డుపై నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవహించడంతో పాటు.. రోడ్డు పూర్తిగా ధ్వసం అయింది. వాహనాల రాకపోకలకు అనుకూలంగా లేదు. దీంతో ఈ మార్గంలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సిన అధికారులు.. కేవలంరెండు వైపులా బారికేడ్లను ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారు.
వారించినా వినకుండా..
ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కానీ కొందరు వాహనదారులు వాటిని పక్కకు జరిపి.. ప్రవాహంలో వాహనంతో దూసుకెళ్తున్నారు. స్థానికులు వారించినా.. వినిపించుకోవడం లేదు. ఫలితంగా కొన్ని మీటర్ల దూరం వెళ్లగానే.. గుంతల్లో పడి, వాగులోకి జారిపోతున్నారు. అధికారుల హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా.. వాహన చోదకుల్లో మార్పు రావటం లేదు. ఇదే విషయమై.. వనస్థలిపురం సీఐ మహేశ్ గౌడ్‌ను వివరణ కోరగా.. వరద ప్రవాహం మొదలు నుంచి బారికేడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయినా కొందరు వాటిని తొలగించి ముందుకు వెళ్లేందుకు యత్నించి, ప్రమాదం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డితో చర్చించి, రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అధ్వానంగా ఇంజాపూర్–తొర్రూర్ రోడ్డు
రక్షణ చర్యలు శూన్యం
పట్టించుకోని అధికార యంత్రాంగం

బారికేడ్లను తొలగించి.. ప్రవాహంలో పయనించి