
రూ.282 కోట్లతో గండిపేట డీపీఆర్
● 27 ఎంజీడీ నీటి తరలింపునకు మరో పైపులైన్
● త్వరలో ప్రభుత్వానికి జలమండలి నివేదిక
సాక్షి, సిటీబ్యూరో: వందేళ్లకు పైగా నగర దాహార్తి తీర్చుతున్న గండిపేట (ఉస్మాన్ సాగర్) నుంచి మరో పైపులైన్‌న్ నిర్మాణం కోసం సుమారు రూ.రూ.282 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించి ప్రభుత్వానికి సమర్పించేందుకు జలమండలి సిద్ధమైంది. నగరం నలుదిక్కులా విస్తరిస్తుండటంతో తాగునీటి అవసరాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జంట జలాశయాలతో పాటు కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూర్ ప్రాజెక్టులను నీటిని తరలిస్తున్నా.. సరిపోని పరిస్థితి. దీంతో అందుబాటులో ఉన్న జలవనరుల నుంచి మరింత నీటిని నగరానికి తరలించేందుకు జలమండలి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గండిపేట జలాశయం నుంచి ఆసిఫ్‌నగర్ రిజర్వాయర్ వరకు మరో పైపులైన్ ఏర్పాటుకు సిద్ధమైంది. గండిపేట నుంచి కాండూట్ లైన్ ద్వారా తరలిస్తున్న జలాలు మార్గమధ్యలో లీకేజీల కారణంగా సగానికిపై వృథా అవుతుండటంతో వాటి మరమ్మతులతో పాటు దానికి సమాంతరంగా కింద భాగంలో పైపులైన్ వేసేందుకు కార్యాచరణకు సిద్ధమైంది.
కాలువ పునరుద్ధరణ..
ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్‌ల వరకు 27 ఎంజీడీ నీటిని తరలించే కాలువను పునరుద్ధరించడం, తరచూ లీకేజీలు, మరమ్మతుల కోసం బ్రేక్‌డౌన్‌ల నివారణ కోసం జలమండలి సిద్ధమైంది. మొత్తంమీద ఉస్మాన్ సాగర్ వద్ద రా వాటర్ ఆర్‌సీసీ సంప్, పంపుహౌస్, 4.0 మీటర్ల ఎత్తు రిటైనింగ్ వాల్, షేక్‌పేటలో నీటిశుద్ధి కేంద్రం, నిర్వాహక భవన నిర్మాణాలు, షేక్‌పేటలో క్లియర్ వాటర్ సంప్ నిర్మాణం, ఆసిఫ్ నగర్ వద్ద 4.0 మీటర్ల ఎత్తు రిటైనింగ్ వాల్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ట్రాన్స్‌మిషన్ కింద వద్ద ప్రతిపాదిత సంప్ వరకు 1500 ఎంఎం వ్యాసం కలిగిన గ్రావిటీ మెయిన్ పైపులైన్, ఉస్మాన్ సాగర్ నుంచి షేక్‌పేట వరకు 1300 ఎంఎం వ్యాసం కలిగిన పంపింగ్ మె యిన్ పైపులైన్, షేక్‌పేట్ నుంచి ఆసిఫ్ నగర్ వరకు 800 ఎంఎం డయా కలిగిన షేక్‌పేట్ పంపింగ్ మెయిన్‌లు, పైపులైన్ నిర్మాణాలు చేపట్టనున్నారు.
సగానికిపైగా నీటి వృథా
గండిపేట నుంచి కాండూట్ ద్వారా నగరానికి తలిస్తున్న నీటిలో సగం నీరు వృథా అవుతోంది. వాస్తవానికి గండిపేట జలాశయం నుంచి సుమారు 26 ఎంజీడీలకుపైగా తాగునీరు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరానికి ప్రతినిత్యం సుమారు 20 నుంచి 22 ఎంజీడీల నీరు తరలిస్తుండగా కాండూట్‌కు అడుగడుగునా లీకేజీల కారణంగా దాదాపు 8 నుంచి 10 ఎంజీడీలు మాత్రమే వినియోగదారులకు సరఫరా అవుతున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గండిపేట నుంచి ఆసీఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్ వరకు సుమారు 14.5 కిలోమీటర్ల పొడువు గల కాండూట్‌కు దాదాపు 45 ప్రాంతాల్లో లీకేజీ సమస్య ఉంది. నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా జర్మన్ టెక్నాలజీతో లీకేజీల మరమ్మతు పనులు నిర్వహించి 1 నుంచి 2 ఎంజీడీల నీటి వృథాను అరికట్టగలిగారు.