
ఎడాపెడా ఎల్సీలకు స్వస్తి
తెగని పంచాయితీ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో.. పాత రిజర్వేషన్లే కొనసాగిస్తారా.. అంటూ పల్లెల్లో చర్చ సాగుతోంది.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘గతంలో ఎల్సీ (లైన్ క్లియరెన్స్)లపై నియంత్రణ ఉండేది కాదు. ఏ సబ్‌స్టేషన్ పరిధిలో ఏ ఫీడర్‌కు ఎల్సీ తీసుకున్నారో క్షేత్రస్థాయి ఇంజనీర్లకు తెలిసేది కాదు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికాం. వారానికి ఒక రోజు (శనివారం) గంట నుంచి రెండు గంటలలోపు మాత్రమే ఎల్సీలకు అనుమతి ఇస్తున్నాం. డిస్కం పరిధిలో మూడు వేలకుపైగా ఫీడర్లు ఉండగా, వీకెండ్‌లో 300లోపు ఫీడర్ల పరిధిలోనే ఎల్సీలు జారీ చేస్తున్నాం. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులకు ముందస్తు సమాచారం చేరవేస్తున్నాం. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడుతున్నాం. ప్రస్తుతం సాంకేతిక కారణాలతో వెలుగు చూస్తున్న స్వల్ప అంతరాయాలే కానీ.. అధికారికంగా ఎలాంటి విద్యుత్ కోతలు అమలు చేయడం లేదు’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.నరసింహులు తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే..
30 నిమిషాలకు మించి ఇవ్వడం లేదు
‘నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా జరుగుతోంది. సామర్థ్యానికి మించి ఉత్పత్తి అవుతోంది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య కనీస వ్యత్యాసం కూడా లేదు. సాంకేతిక కారణాలతో అక్కడక్కడా వెలుగుచూస్తున్న అంతరాయాలకు కారణాలపై విశ్లేషిస్తున్నాం. ఇంజనీర్లు వెంటనే అప్రమత్తమై సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఎఫ్‌ఓఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తున్నాం. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా కాపాడుతున్నాం. అయినా కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి వీకెండ్ మినహా ఇతర రోజల్లో ఎల్సీలకు అనుమతి ఇవ్వడం లేదు. మల్టీ స్టోరేజీ భవనాలకు, వాణిజ్య సముదాయాల్లోని కొత్త కనెక్షన్లు, డీటీఆర్ ఛార్జింగ్ కోసం 30 నుంచి 60 నిమిషాలు మాత్రమే ఎల్సీ ఇస్తున్నాం. అదీ కార్పొరేట్ ఆఫీసు నుంచి లిఖిత పూర్వక అనుమతి పొందిన వారికే. సాధారణ సర్వీసులకు కనెక్షన్ ఇచ్చేందుకు ఎలాంటి ఎల్సీలు అవసరం లేదు. క్షేత్రస్థాయిలోని డీటీఆర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేసి కనెక్షన్ ఇచ్చే వెసులుబాటు కల్పించాం.
వినియోగం చూస్తే ఆశ్చర్యమేస్తోంది
ప్రస్తుతం గ్రేటర్‌లో 63 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి తోడు ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల సర్వీసులు వచ్చి చేరుతున్నాయి. కనెక్షన్లతో పాటు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. గతంలో వేసవిలో మాత్రమే ఏసీలు వాడేవారు. ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో ఏసీ పని చేస్తూనే ఉంది. ఏడాదికి కనెక్షన్ల పెరుగుదల 10 నుంచి 12 శాతం ఉండగా, విద్యుత్ వినియోగం 30 నుంచి 40శాతం నమోదవుతోంది. బిల్లే కదా కట్టుకుందాం అనే ధోరణి ఇటీవల విపరీతంగా పెరిగింది. గృహజ్యోతి పథకం లబ్ధిదారుల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. గతంలో 100 యూనిట్లలోపు వాడేవారు.. ప్రస్తుతం 200 యూనిట్లకుపైగా వినియోగిస్తున్నారు. ఏకధాటి వర్షాలు, వరదల సీజన్‌లోనూ ఇదే స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోం
ఒకవైపు సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తూనే.. మరోవైపు క్షేత్రస్థాయి సిబ్బంది పని తీరులోనూ మార్పునకు కృషి చేస్తున్నాం. సీఎండీ ముషారఫ్ ఫరూఖీతో కలిసి ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో సర్కిళ్లు, డివిజన్లు, సెక్షన్ ఇంజనీర్లతో సమావేశమవుతున్నాం. రాత్రి పగలు తేడా లేకుండా జోరు వానలోనూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నాం. వినియోగదారులను స్వయంగా కలిసి విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నాం. సరఫరాలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇంజనీర్లు, జూనియర్ లైన్‌మెన్లపై చర్యలకు ఆదేశిస్తున్నాం. కొత్త కనెక్షన్లజారీలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. సెక్షన్ల వారీగా పెండింగ్ దరఖాస్తులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. అవినీతి నిర్మూలన కోసం ఇప్పటికే సర్కిళ్లు, సెక్షన్లతో పాటు బహుళ అంతస్తుల భవనాల్లో కాల్ సెంటర్ నంబర్లతో కూడిన స్టిక్కర్లు అటించాం. ఇంజనీర్ల పనితీరుపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాం అని స్పష్టం చేశారు.
వారంలో ఒకే రోజుకు పరిమితం
గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
అయినా నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు సరఫరా
అంతరాయాలు తప్ప ఎలాంటి కోతలు లేవు
‘సాక్షి’తో డిస్కం ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ నరసింహులు

ఎడాపెడా ఎల్సీలకు స్వస్తి