‘ఇంట’ర్నెట్‌ కట్‌కట | - | Sakshi
Sakshi News home page

‘ఇంట’ర్నెట్‌ కట్‌కట

Sep 15 2025 9:19 AM | Updated on Sep 15 2025 9:19 AM

‘ఇంట’ర్నెట్‌ కట్‌కట

‘ఇంట’ర్నెట్‌ కట్‌కట

ఫోన్లకూ తప్పని సిగ్నల్‌ సమస్య

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఆవుల కుమ్ములాటలో దూడలు బలైనట్లు’ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ–ఇంటర్నెట్‌ ఆప్టికల్‌ సర్వీసు ప్రొవైడర్లు(ఐఎస్‌పీ), ఎంఎస్‌ఓలు, లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లు (ఎల్‌సీఓలు) మధ్య నెలకొన్న పోరులో అమాయక వినియోగదారులు బలవుతున్నారు. మూడు వారాలు దాటినా ఇంటర్నెట్‌ సేవలు, టీవీ ప్రసారాలను పునరుద్ధరించకపోవడంతో.. ఇంటి నుంచి విధులు నిర్వహించే ఐటీ, అనుబంధ రంగాల ఉద్యోగులు సహా పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు బోధించే తల్లిదండ్రులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. వివిధ ఆఫర్లలో భాగంగా ముందే ఏడాది/ఆరు నెలల చార్జీలు చెల్లించిన వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది.

● ఆగస్టు 17న రామంతాపూర్‌ గోఖలేనగర్‌ ఘటనతో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలకు, కార్మికులు, సాధారణ పౌరుల మృత్యువాతకు కారణమవుతున్న ఈ ప్రమాదకరమైన ఆప్టికల్‌ కేబుల్‌ వైర్ల తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు కొద్ది రోజులుగా గ్రేటర్‌ జిల్లాల్లో ఎక్కడికక్కడే కేబుళ్లను కట్‌ చేస్తోంది. స్తంభాలపై లైన్లు వేస్తున్నప్పుడు మిన్నకుండిపోయి.. తీరా వేసిన తర్వాత కట్‌ చేయడం ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఐఎస్‌పీలు, ఎంఎస్‌ఓలు, ఎల్‌సీఓలు తప్పు చేస్తే.. వినియోగదారులకు శిక్ష వేయడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది.

రూ.100 కోట్లకుపైగా నష్టం

● గ్రేటర్‌ పరిధిలో ఐదు లక్షలకుపైగా విద్యుత్‌ స్తంభాలు ఉన్నట్లు అంచనా. ఏదైనా విద్యుత్‌ స్తంభంపై కేబుల్‌ వేయాలంటే ముందస్తుగా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇందుకు ఒక్కో స్తంభానికి ఏటా రూ.50 నుంచి రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంది. 15 మీటర్ల ఎత్తులోనే కేబుల్‌ అమర్చుకోవాలి. మెజారిటీ కేబుళ్లు ఆరేడు అడుగుల ఎత్తులోనే వేలాడుతున్నాయి. ఒక స్తంభానికి, మరో స్తంభానికి మధ్య 50 మీటర్లకు మించరాదు.. కానీ మెజార్టీ స్తంభాలకు టన్నుల కొద్దీ బరువైన కేబుల్‌ ఉండలు వేలాడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి మధ్యలో ఏదైనా చెట్టు కొమ్మ విరిగి లైన్‌పై పడితే.. ఆ బరువుకు రెండు వైపులా ఉన్న స్తంభాలు నేలకూలుతున్నాయి.

● దెబ్బతిన్న ఇన్సులేటర్లు, జాయింట్లను పునరుద్ధరించేందుకు లైన్‌మెన్లు స్తంభాలపైకి ఎక్కడం చాలా కష్టంగా మారింది. కేబుళ్ల నుంచి ఎర్తింగ్‌ రివర్స్‌ వల్ల షాక్‌తో కిందపడి పోతున్న ఘటనలు లేకపోలేదు. కనీస అనుమతులే కాదు కనెక్షన్‌, మీటర్‌ తీసుకోకుండా ఏకంగా కేబుల్‌ జంక్షన్‌ బాక్సులకు కరెంట్‌ను వినియోగిస్తున్నారు. ఏళ్ల తరబడి కళ్లముందే ఈ చౌర్యం జరుగుతున్నా.. క్షేత్రస్థాయి ఇంజినీర్లు పట్టించుకోలేదు. కొత్తగా అనేక ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లు (ఐఎస్‌పీ), ఎంఎస్‌ఓలు, లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లు (ఎల్‌సీఓలు) పుట్టుకురావడం, వ్యాపారంలో పోటీతో ఎవరికి వారు స్తంభాలపై కేబుళ్లను వేసుకుంటూ ముందుకెళ్లడం, ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పడు పాత వైర్లను అలాగే వదిలేసి, కొత్తగా మరో ఆప్టికల్‌ కేబుల్‌ను అమర్చుతుండటం, తాజాగా వాటన్నింటినీ తొలగిస్తుండటంతో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచ్చిందని ఆయా సర్వీసు ప్రొవైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు వారాలైనా పునరుద్ధరణకు నోచుకోని సేవలు

వివిధ ఆఫర్లలో ముందే చార్జీలు చెల్లించిన వినియోగదారులు

ఆన్‌లైన్‌ సేవల అంతరాయాలపై విరుచుకుపడుతున్న సిటిజన్లు

కేవలం ఆపరేటర్లే కాదు సేవల వినియోగంలో భాగంగా ముందే ఆఫర్ల పేరుతో (సంవత్సరం/ఆరు నెలలు) చార్జీలు చెల్లించిన గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మూడు వారాలైనా ఆయా సర్వీసులు పునరుద్ధరించపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక..ఆయా సర్వీసు ప్రొవైడర్లు కాల్‌ సెంటర్లు/ వ్యక్తిగత ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేస్తున్నారు. మెజార్టీ ప్రజలు గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వైఫై సర్వీసులను వాడుతున్నారు. ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లోనూ ఈ తరహా సేవలనే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆప్టికల్‌ కేబుళ్లన్నింటినీ కట్‌ చేయడంతో సర్వీసులు నిలిచిపోయి సిగ్నల్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. రోజంతా టీవీ సీరియల్స్‌, ఓటీసీ సినిమాలు, యూట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సర్వీసులకు అలవాటు పడిన గృహిణులు ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు. కట్‌ చేసిన కేబుళ్లను అక్కడే రోడ్లపైనే గుట్టలుగా వదిలేసి వెళ్తుండటం, అటుగా వచ్చి పోయే వాహనదారులు వైర్ల మధ్య చిక్కుకుని ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల రాకపోకల సమయంలో కేబుళ్లు టైర్ల మధ్య చిక్కుకు పోయి ప్రమాదాలకు కారణమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement