
చెట్లు.. కాపాడేటట్లు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రోడ్డుకు ఇరువైపులా ఉన్న పురాతన మర్రి చెట్లకు ముప్పు లేకుండా నిర్మాణంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చెట్ల ఉనికిని ఏమాత్రం దెబ్బతీయకుండా ఆయా ప్రాంతాల్లో స్వల్ప మార్పులు చేపట్టా లని భావిస్తున్నట్లు సమాచారం. వరుస ప్రమా దాల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)లో కేసులు వేసిన పర్యావరణవేత్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్‌జీటీ అంగీకారం, పర్యావరణవేత్తల సూచనల మేరకు ఇకపై ముందుకు వెళ్లనుంది. ఎన్‌జీటీలో కేసుల కారణంగా నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ పనులకు త్వరలో మోక్షం లభించే అవకాశం ఉంది.
నాలుగేళ్ల క్రితమే శంకుస్థాపన
బీజాపూర్ రహదారి 163పై రక్తపుటేరులు పారుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు మృత్యువాత పడుతూనే ఉన్నారు. ప్రమాదాల నివారణ, మెరుగైన ప్రయాణం కోసం ఇటు అప్పా జంక్షన్ (తెలంగాణ పోలీసు అకాడమీ) నుంచి అటు మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా విస్తరించాలని ఆరేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.928.41 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. మొత్తం 266.55 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించింది. అప్పా టు మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర విస్తరించతల పెట్టిన రోడ్డు పనులకు 29 ఏప్రిల్ 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. దారి పొడవునా 18 అండర్‌పాసులు, మొయినాబాద్ సమీపంలో 4.35 కి.మీ, చేవెళ్ల సమీపంలో 6.36 కి.మీ రెండు బైపాస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసులతో జాప్యం
రోడ్డుకు ఇరువైపులా పురాతన, ఎత్తయిన మర్రి చెట్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా 750పైగా వృక్షాలను తొలగించాల్సి వచ్చింది. ఇదే అంశంపై శ్రీబన్యన్ ట్రీశ్రీ అనే స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎన్జీటీని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో రోడ్డు పనులకు బ్రేక్ పడింది. భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసిన నాటి ప్రభుత్వం చెట్లను రీ లొకేట్ చేసి, కేసును ఎత్తివేయించలేకపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాకు ఇదే మార్గం నుంచి వెళ్లి వస్తుండటం, ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం, ఏళ్లుగా రోడ్డు నిర్మాణం ముందుకు సాగకపోవడంపై స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వంకరలు లేకుండా అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులతో కూడిన నిర్మాణ పనుల డీపీఆర్‌ను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. చెట్లున్న చోట రోడ్డును ఒకవైపు పెంచుతూ పోవడం ద్వారా ఆయా వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఉండబోదని ఎన్జీటీకీ వివరించనుంది. ఎన్జీటీలో ఇప్పటికే నమోదైన కేసు వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు
కొలిక్కిరానున్న బీజాపూర్ రహదారి విస్తరణ
రోడ్డు వంకరలు లేకుండా ముందస్తు చర్యలు
ఎన్‌జీటీకీ స్పష్టం చేయనున్న ప్రభుత్వం
ఇప్పటికే భూసేకరణ పూర్తి.. రెండు చోట్ల బైపాస్ పనులు

చెట్లు.. కాపాడేటట్లు!