
ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీమా సీను, జిల్లా అధ్యక్షుడు కొంతం యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్ 26న చలో ఇందిరా పార్కు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 584 మండలాల ఉద్యమకారుల చైతన్య యాత్ర శనివారం యాచారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉద్యమాలతో తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు. పదేళ్లలో ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ బోర్డుకు రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు, ట్రైన్ పాసులు, ఆరోగ్య కార్డులు కల్పించాలని, ఉద్యోగాల్లో 20 శాతం కోట కేటాయించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించి పదవులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు విష్ణు, నరేందర్, శ్యామల, బోసుపల్లి వీరేశం, శ్యామ్, నక్క జంగయ్యగౌడ్, కందుకూరి జంగయ్య, కారింగ శంకర్, గండికోట పాండు, బైరెడ్డి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం చేరిన బస్సుయాత్ర
ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చేపట్టిన బస్సుయాత్ర శనివారం ఇబ్రహీంపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమకారులు డా. శ్రీనివాస్, డబ్బికార్ శ్రీనివాస్, కొంతం యాదగిరిరెడ్డి, బోసుపల్లి వీరేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల ప్లాట్లు, పింఛన్లు, గుర్తింపు కార్డులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యమకారులు విష్ణువర్ధన్, జానికిరెడ్డి, శ్యామల, మహేందర్, రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.