
రాజీమార్గం ఉత్తమం
ఇబ్రహీంపట్నం: క్షణికావేశంలో జరిగిన గొడవలు, పంచాయతీలతో కేసుల్లో చిక్కిన కక్షిదారులు రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం శ్రేయస్కరమని ఇబ్రహీంపట్నం కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీదేవి అన్నారరు. ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 1,112 సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ కేసుల్లో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేకంటే రాజీపడి పరిష్కరించుకోవడం మేలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రీటాలాల్‌చంద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్, ఏసీపీ రాజు పాల్గొన్నారు.