
యూరియా కోసం యుద్ధం
● ఒక్క బస్తా కోసం తెల్లవారుజామునుంచే పడిగాపులు
● పంటను బతికించుకునేందుకు రైతుల తిప్పలు
మంచాల: యూరియా కొరత రైతులను వేధిస్తోంది. పనులు మానుకుని తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. మండల పరిధిలో 34 వేల ఎకరాలు సాగుకు అనువైన భూమి ఉంది. ఇందుకు సాధారణ సాగుభూమి 28 వేల ఎకరాలు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రస్తుతం 13,500 ఎకరాల్లో సాగు చేపట్టారు. గతేడాది వర్షాకాలంలో 12 వేల ఎకరాలు సాగు చేయగా ప్రభుత్వం 147 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసింది. ఈ ఏడాది అదనంగా మరో 1,500 ఎకరాలకు పైగా సాగు చేపట్టారు. ఇందుకు ప్రభుత్వం 300 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసింది. అయినప్పటికీ రైతులకు యూరియా కోసం ఎగబడుతూనే ఉన్నారు.
నిరాశలో రైతులు
మంచాల మండల పరిధిలో 23 పంచాయతీలకు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రంలోనే యూరియా, ఎరువులు అందిస్తున్నారు. యూరియా సరఫరా చేస్తున్న విషయం తెలుసిన వెంటనే రైతులు ప్రైవేట్ వాహనాలు కిరాయి తీసుకుని పీఏసీఎస్ కేంద్రానికి వస్తున్నారు. 1,500 మంది క్యూలో ఉంటే కేవలం 400–500 మందికి మాత్రమే ఒక్కొక్క బస్తా చొప్పున ఇచ్చి పంపుతున్నారు. దీంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.