
పట్టించుకోరు.. పరిష్కరించరు
కలెక్టరేట్‌లో అర్జీదారుల ఆవేదన
● త్రిపుల్ ఆర్ వద్దంటూ రైతుల ఆందోళన
● ప్రజావాణికి వినతుల వెల్లువ
ఇబ్రహీంపట్నం రూరల్: ‘ఎన్నో సమస్యలతో ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలకు ఓర్చి కలెక్టరేట్‌కు వస్తున్నాం. అయినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. సమస్య వినరు. దరఖాస్తులు తీసుకొని, పొమ్మంటున్నారు. కానీ సమస్యలు తీర్చడం లేదు’ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్‌లో నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులతో ప్రజలు బారులు తీరారు. సమస్యలు తీర్చాలని ఏళ్లుగా తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని కలెక్టర్ తదితర అధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావాణిని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 64 అర్జీలను అధికారుల స్వీకరించారు.
ప్రాణాలైనా ఇస్తాం..
చిన్నసన్నకారు రైతులు సాగు చేసుకొంటూ జీవనోపాధి పొందుతన్న భూముల నుంచి త్రిపులఆర్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అలైన్‌మెంట్ చేసిందని కేశంపేట మండలం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధి తొమ్మిదిరేకుల గ్రామంలో 1420 ఎకరాల భూమిని 1518 మంది సాగు చేసుకొంటున్నామని తెలిపారు. ఈ భూముల్లోకి రోడ్డు వేయడానికి వీళ్లేదని, అలా చేస్తే తామంతా రోడ్డున పడతామని వాపోయారు. మాడ్గుల మండలం కలకొండ చంద్రాయన్‌పల్లిలో భూములను రోడ్డు కోసం తీసుకున్నా రని పేర్కొన్నారు. పెద్దలను వదిలి.. పేదల భూముల్లో రోడ్డు తీయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల భూముల్లోంచి ఉన్న అలైన్‌మెంట్ మార్చడం సిగ్గు చేటన్నారు. ప్రాణాలైన ఇస్తాం.. కాని భూములు ఇవ్వమన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగా.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.ఇందిరమ్మ బిల్లు ఇవ్వాలి
నా భార్య ఎక్కాల మనీష పేరిట ఇల్లు వచ్చింది. బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తిచేసి 74 రోజులు గడిచింది. అయినా బిల్లు రావడం లేదు. బిల్లు ఇవ్వమంటే పీడీ నుంచి ఏఈ, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అందరూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
–ప్రభాకర్, కందుకూరు
నాలుగేళ్లుగా తిరుగుతున్నా
మంచాల మండలం, అజ్జిన తండాల్లో మానాన్న పేరిట భూమి ఉంది. సర్వే నంబరు మిస్సింగ్ గురించి దరఖాస్తు చేసుకున్నాము. నాలుగేళ్లుగా తిరుగుతున్నాం. ఆర్డీఓ మొదలు తహసీల్దార్ వద్దకు తిరగని రోజు లేదు. కలెక్టర్ దగ్గరకు వస్తే అక్కడ భూమి లేదని చెబుతున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయాలి.
– సరిత, గిరిజన మహిళ
భూమి అమ్మలేదని..
మాకు తుక్కుగూడలో మూడు ఎకరాల భూమి ఉంది. ఇటీవల వట్రీక్స్ పేరుతో గొడవలు జరిగాయి. ప్రభుత్వ అధికారులు వచ్చి సీలింగ్ భూములని హద్దులు వేశారు. భూమి అమ్మలేదన్న అక్కసుతో కొందరు నాయకులు కావాలనే మమ్మల్ని ఇబందులకు గురిచేస్తున్నారు. మీకు భూమి లేదని హెచ్చరిస్తున్నారు. మా భూమి మాకుఇప్పించాలి. – ప్రకాష్‌రెడ్డి, తుక్కుగూడ
ఇల్లు ఇవ్వకుంటే చచ్చిపోతా
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇల్లు ఇవ్వకుంటే చచ్చిపోతాను. లంచం ఇస్తేనే ఇల్లు ఇస్తామని కొందరు అంటున్నారు. ఇదే విషయమై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
– సుల్తానాబేగం, రాజేంద్రనగర్