
బైక్ అదుపు తప్పి మహిళ మృతి
పహాడీషరీఫ్: బైక్ అదుపు తప్పి కింద పడటంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రావిరాలకు చెందిన దార సుశీల (55) ఆర్సీఐ రోడ్డులోని విజయ డెయిరీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. రోజూ మాదిరిగానే నడుచుకుంటూ విధులకు వెళ్తున్న ఆమె.. బైక్‌పై అటుగా వెళ్తున్న ఓ యువకుడిని లిఫ్ట్ అడిగింది. ఇద్దరూ కొద్దిదూరం వెళ్లగానే అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం అదుపు తప్పింది. బైక్ పైనుంచి కిందపడిన సుశీల తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.