
చోరీకి పాల్పడిన ముగ్గురి అరెస్టు
మొయినాబాద్: తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడి బంగారం, నగదు దోచుకెళ్లిన దొంగలను రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్‌కు చెందిన బొర్ర జంగయ్య ఇంట్లో ఈ నెల 17న చోరీ జరిగింది. 16న బోనాల పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి అమిర్‌గూడలో ఉండే తన అక్క ఇంటికి వెళ్లారు. 17న సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు, రెండు బీరువాల తాళాలు పగులగొట్టి 9 తులాల బంగారు నగలు, రూ.3.70 లక్షల నగదు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా మంగళవారం రాజేంద్రనగర్ సీసీఎస్ పోలీసులు కాళీమందిర్ సమీపంలో ముగ్గురు అనుమానితులు మియాపూర్‌కు చెందిన షేక్ అబ్బు తలీబ్ అలియాస్ ఫైజాన్, అబ్దుల్ రియాజ్ అలియాస్ డాన్, మెహదీపట్నం రేతిబౌలికి చెందిన షేక్ ఉస్మాన్ అలియాస్ సైఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో సంగారెడ్డిలో ఆటో దొంగిలించి, మణికొండలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసిన తరువాత మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో దొంగతనం చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద 10 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి ఆభరణాలు, రూ.3.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న ముఠా